అమెరికాలో కోవిడ్ బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. దేశవ్యాప్తంగా హాస్పిటళ్లలో ఉన్న ఇంటెన్సివ్ కేర్ బెడ్స్ త్వరత్వరగా నిండిపోతున్నాయి. దీంతో మళ్లీ అమెరికాలో కరోనా భయం పట్టుకున్నది. కోవిడ్ సోకిన, అనుమానిత రోగులు ఐసీయూ బెడ్స్ కోసం ఆపసోపాలు పడుతున్నారు. గత ఏడాదితో పోలిస్తే 15 రాష్ట్రాల్లో ఇప్పుడు ఐసీయూ బెడ్స్‌కు ఎక్కువ డిమాండ్ ఉన్నట్లు ఆరోగ్య, మానవ సేవల శాఖ తెలిపింది. మిన్నసొట్టా, కొలరాడో, మిచిగన్‌లో 37, 41, 34 శాతం ఐసీయూ బెడ్స్ నిండుకున్నాయి.
కరోనా పేషెంట్లతో ఆస్పిటళ్లు ఫుల్‌కావడంతో ఇతర వ్యాధులతో బాధపడేవారి పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. వాషింగ్టన్ యూనివర్సిటీ హాస్పిటల్ ఫిజిషియన్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు ప్రొఫెసర్ అలీ మోకాదా తెలిపారు. వ్యాక్సినేట్ కానివాళ్లే ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలిపారు. అమెరికాలో ఇప్పటికీ రోజూ సగటున వెయ్యి మంది కరోనాతో మరణిస్తున్నారు. గత మూడు నెలల నుంచి ఇదే సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. మరణాల సంఖ్య పెరిగిందంటే ఇన్ఫెక్షన్ పెరిగినట్లే అని డాక్టర్లు చెబుతున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా ఉన్న కారణంగా మళ్లీ కేసులు పెరుగుతున్నట్లు అనుమానం వ్యక్తం అవుతోంది.