ప్రవాస భారతీయులకు రూపాయి పతనం కలిసొస్తున్నది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజుకొక కనిష్ఠ స్థాయికి పడిపోతుండటంతో విదేశాల్లో స్థిరపడిన భారతీయులు దేశీయంగా భారీగా పెట్టుబడులు పెట్టడానికి ముందు కొస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగం అంతంత మాత్రంగానే ఉండటంతో ప్రత్యామ్నాయాల్లో భాగంగా డిపాజిట్లకు మొగ్గుచూపుతున్నారని రిజర్వు బ్యాంక్ వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి ఏడు నెలల్లో(ఏప్రిల్ నుంచి అక్టోబర్ వరకు) ఏకంగా 12 బిలియన్ డాలర్ల విలువైన డిపాజిట్లు చేశారు. వీటిలో ఫారిన్ కరెన్సీ నాన్-రెసిడెంట్ (ఎఫ్‌సీఎన్‌ఆర్) డిపాజిట్లు, నాన్-రెసిడెంట్ ఎక్స్‌టర్నల్(ఎన్‌ఆర్‌ఈ) డిపాజిట్లు, నాన్-రెసిడెంట్ ఆర్డినరి(ఎన్‌ఆర్‌వో) డిపాజిట్లు ఉన్నాయి.
క్రితం ఏడాది ఇదే సమయంలో చేసిన 6.11 బిలియన్ డాలర్ల డిపాజిట్లతో పోలిస్తే రెండు రెట్లు పెరిగాయి. దీంతో అక్టోబర్ 2024 చివరినాటికి ఎన్‌ఆర్‌ఐ డిపాజిట్లు 162.69 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. అంతక్రితం ఏడాది ఇది 143.48 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఒక అక్టోబర్ నెలలోనే ప్రవాస భారతీయులు బిలియన్ డాలర్ల విలువైన పెట్టుబడులు పెట్టడం విశేషం. వీటిలో అత్యధికంగా ఎఫ్‌సీఎన్‌ఆర్(బీ) డిపాజిట్ల రూపంలో వచ్చాయని సెంట్రల్ బ్యాంక్ వెల్లడించింది. ఏడాది క్రితం 2.06 బిలియన్ డాలర్లు రాగా, ఈసారి మూడింతలు పెరిగి 6.1 బిలియన్ డాలర్ల కు చేరుకున్నాయని తెలిపింది. ఏడాది నుంచి ఐదేండ్ల కాలపరిమితితో కూడిన డిపాజిట్లకు అత్యధిక మంది ఎన్‌ఆర్‌ఐలు ఆసక్తి చూపుతున్నారని, ఈ డిపాజిట్లు కూడా విదేశీ కరెన్సీ రూపంలో చేస్తుండటం విశేషం.