ఎన్టీఆర్ నటిస్తున్న తాజా చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకా లపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాష్‌రాజ్, శ్రీకాంత్, టామ్ షైన్ చాకో, నరైన్ తదితరులు నటిస్తున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ విషయాన్ని మేకర్స్ ప్రకటించారు. తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో భారీ స్థాయిలో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా విడుదల చేసిన కొత్త పోస్టర్ లో ఎన్టీఆర్ రౌద్రరసపూరితంగా కనిపిస్తున్నారు.
దసరా బరిలో ఈ సినిమా వస్తుండటంతో ఎన్టీఆర్ అభిమానులు సంబరపడిపోతున్నారు. తీర ప్రాంత నేపథ్య కథాంశంతో భారీ యాక్షన్ హంగులతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఎర్ర సముద్రం నేపథ్యంలో విడుదల చేసిన ఈ చిత్ర ఫస్ట్‌గ్లింప్స్‌కు అద్భుతమైన స్పందన లభించింది. ఈ సినిమాను 2024 అక్టోబర్ 10న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి కెమెరా: రత్నవేలు, సంగీతం: అనిరుధ్ రవిచందర్, ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్, రచనా-దర్శకత్వం: కొరటాల శివ.