అమెరికాలో వింటర్ స్టార్మ్ బీభత్సం సృష్టిస్తున్నాయి. అమెరికాలోని ఈశాన్య రాష్ట్రాలను డెవిన్ అనే భారీ మంచు తుపాను అతలాకుతలం చేస్తోంది. క్రిస్మస్ పండుగ ముగిసిన వెంటనే విరుచుకుపడటంతో ప్రయాణ వ్యవస్థ పూర్తిగా స్తంభించిపోయింది. ఈ తుపాను కారణంగా దాదాపు 1,800కిపైగా విమానాలు రద్దయ్యాయి. 10 వేల విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్‌సైట్ ప్రకారం.. శుక్రవారం సాయంత్రం 4 గంటల సమయానికి దేశవ్యాప్తంగా 1,802 విమానాలు రద్దుకాగా, 22,349 ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో న్యూయార్క్‌లోని జాన్ ఎఫ్.కెన్నెడీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు, లాగ్వార్డియా విమానాశ్రయం, డెట్రాయిట్ మెట్రోపాలిటన్ వేన్ కౌంటీ విమానాశ్రయం సహా ఈశాన్య, మిడ్‌వెస్ట్‌లోని విమానాశ్రయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జెట్‌బ్లూ ఎయిర్‌లైన్స్ ఒక్కటే తన షెడ్యూల్‌లో 22 శాతం అంటే సుమారు 225కు పైగా విమానాలను రద్దు చేసింది. ఇతర ప్రధాన విమానయాన సంస్థలు కూడా వందలాది సర్వీసులను నిలిపివేశాయి. డెల్టా ఎయిర్‌లైన్స్ 186 విమానాలను, రిపబ్లిక్ ఎయిర్‌వేస్ 155 విమానాలను, అమెరికన్ ఎయిర్‌లైన్స్ 96, యునైటెడ్ ఎయిర్‌లైన్స్ 82 విమానాలను రద్దు చేసింది.















