రాజ్ వేంకటాచ్ఛ హీరోగా నటించి, దర్శకత్వం వహించిన సినిమా ధర్మవరం. ఈ సినిమాకు కథను కూడా ఆయనే అందించారు. సంయోగిత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ఇతర ప్రధాన పాత్రలను అజయ్, నవీన్ రెడ్డి, ఏషాన్ ఖాన్ తదితరులు పోషించారు. గ్రామీణ సాంప్రదాయాలు, సాంస్కృతిక, కుటుంబ బంధాలు, భావోద్వేగాలతో నిండిన ఈ సినిమా ప్రేక్షకుల మనసులను అలరించనుందనే నమ్మకాన్ని యూనిట్ సభ్యులు వ్యక్తం చేస్తున్నారు.

వినాయక చవితి సందర్భంగా ఈ మూవీ పోస్టర్ ను అనిల్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూవీ పోస్టర్ చాలా బాగుందని, ఇది ఓ కొత్త ప్రయత్నంగా కనబడుతోందని, రాజ్ వేంకటాచ్ఛ హీరోగా, దర్శకుడిగా చేస్తున్న ఈ సినిమా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నానని తెలిపారు. హీరో కమ్ డైరెక్టర్ రాజ్ వేంకటాచ్ఛ మాట్లాడుతూ ధర్మవరం సినిమా నాకు ప్రాణప్రదమైన ప్రాజెక్ట్. ఈ చిత్రంలో ప్రతి సన్నివేశం మనసుకు హత్తుకునేలా ఉండాలని ఎంతో కష్టపడ్డాం. వినాయక చవితి పర్వదినం సందర్భంగా పోస్టర్ విడుదల కావడం మాకు ఒక శుభసూచకం. ప్రేక్షకుల ఆశీర్వాదాలు మాకుంటే ఈ సినిమా ఖచ్చితంగా విజయవంతం అవుతుంది అని తెలిపారు. అతి త్వరలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చెప్పారు. ప్రసాద్, నెరిమెట్ల వెంకట్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రానికి విజేత కృష్ణ సంగీతం అందిస్తున్నారు.















