దర్శకరత్న స్వర్గీయ దాసరి నారాయణరావు జయంతి వేడుకలను తెలుగు ఫిల్మ్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ ఫిల్మ్‌ఛాంబర్‌లో జరిగిన ఈ వేడుకలో భాగంగా ఫిల్మ్‌ఛాంబర్ ప్రాంగణం లో ఏర్పాటు చేసిన దాసరి విగ్రహానికి పూలమాలలు వేసి అసోసియేషన్ సభ్యులు నివాళులర్పించారు. దాసరి పుట్టినరోజును డైరెక్టర్స్ డే గా ప్రకటించిన నేపథ్యంలో, ఈ డైరెక్టర్స్ డే వేడుకలను ఈ నెల 19న హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఘనంగా నిర్వహించనున్నట్టు తెలిపారు.అనంతరం ఈవెంట్ డేట్ పోస్టర్‌ను తమ్మారెడ్డి భరద్వాజ చేతుల మీదుగా విడుదల చేశారు.
ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు వీరశంకర్, దర్శకులు రేలంగి నరసింహారావు, శంకర్, గోపీ చంద్ మలినేని, అనిల్ రావిపూడి, వశిష్ఠ, విజయ్ కనకమేడల, నిర్మాతల మండలి అధ్యక్షుడు వి.దామోదర ప్రసాద్, సి.కల్యాణ్, ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ వల్లభనేని, ఫిల్మ్‌నగర్ కార్పొరేటర్ కాజా సూర్య నారాయణ, తెలంగాణ ఫిల్మ్‌ఛాంబర్ కార్యదర్శి అనుపమరెడ్డి, నిర్మాత ప్రసన్నకుమార్ తదితరులు పాల్గొన్నారు.