Namaste NRI

మీరు బయటకు రావొద్దు.. సుడాన్‌లోని భారతీయులకు హెచ్చరిక

ఆఫ్రికా దేశమైన సుడాన్‌ లో ఆర్మీ, పారామిలటరీ దళాల మధ్య ఘర్షణ జరుగుతున్నది. రాజధాని ఖార్టూమ్‌లో ఇరు వైపులా భారీగా కాల్పులు, పేలుళ్లు జరిగాయి. ఈ నేపథ్యంలో సుడాన్‌లోని భారతీయులు బయటకు రావద్దని, ఇళ్లలోనే ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఖార్టూమ్‌లోని భారతీయ రాయబార కార్యాలయం సూచించింది. భారతీయులు ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండాలని, తాజా అప్‌డేట్స్‌ కోసం వేచి ఉండాలంటూ వెల్లడించింది.

 కాగా, సుడాన్‌ ఆర్మీ చీఫ్‌ జనరల్‌ అబ్దెల్ ఫత్తా అల్ బుర్హాన్, పారామిలటరీ కమాండర్‌ మొహమ్మద్ హమ్దాన్ డాగ్లో మధ్య గత కొంతకాలంగా పోరు జరుగుతున్నది. 2021లో జరిగిన సైనిక తిరుగుబాటుకు ముగింపు పలికి దేశాన్ని సాధారణ పరిస్థితికి తీసుకురావడం, పారామిలిటరీ దళానికి చెందిన ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ (ఆర్‌ఎస్‌ఎఫ్‌)ను ప్రణాళికాబద్ధంగా సైన్యంలోకి కలపడంపై చర్చలకు ఆర్మీ చీఫ్‌ ప్రతిపాదించారు. అయితే ఆర్‌ఎస్‌ఎఫ్‌ చీఫ్‌ డాగ్లో దీనిని వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో సుడాన్‌ ఆర్మీ, పారామిలటరీ దళాల మధ్య వార్‌ జరుగుతున్నది.

ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ దళాలు నగరంలోని ప్రధాన ఎయిర్‌పోర్టును తమ అధీనంలోకి తీసుకున్నాయి. దీంతో విమాన సర్వీసులన్నీ రద్దయిపోయాయి. మరోవైపు, ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్స్ దళాలను సైన్యం అన్ని వైపుల నుంచి చుట్టుముట్టింది. దేశాన్ని కాపాడుకునేందుకు తాము చేయగలిగిందంతా చేస్తున్నట్టు సైనిక దళాల ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events