
హెచ్-1బీ వీసా ఫీజును 1 లక్ష డాలర్లకు(రూ. 90 లక్షలు) పెంచుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని అడ్డుకోవాలని కోరుతూ కాలిఫోర్నియాతోపాటు మరో 19 అమెరికన్ రాష్ర్టాలు బోస్టన్లోని ఫెడరల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. వీసా జారీకి అయ్యే నిర్వహణ ఖర్చులను మాత్రమే ఇమిగ్రేషన్ అధికారులు వసూలు చేయాల్సి ఉంటుందని, కాని ఫెడరల్ చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఫీజును విధించే అధికారం అధ్యక్షుడికి లేదని కాలిఫోర్నియా అటార్నీ జనరల్ రోబ బోంటా కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. హెచ్-1బీ వీసా ఫీజు పెంపుతో విదేశీ నిపుణుల కొరత ఏర్పడగలదని, దీని వల్ల వివిధ రంగాలు నష్టపోయే అవకాశం ఉందని రాష్ర్టాలు వాదించాయి. విద్య, ఆరోగ్యం, ఇతర అత్యవసర సర్వీసులలో దీని ప్రభావం తీవ్రంగా ఉండగలదని పిటిషనర్లు ఆందోళన వ్యక్తం చేశారు. న్యూయార్క్‌లోని ఆరోగ్య సిబ్బందిలో మూడు వంతుల మంది విదేశీ ఉద్యోగులే ఉన్నారని, అదే యూనివర్సిటీలు, దవాఖానలలో హెచ్-1బీ వీసాలపై పనిచేస్తున్న నిపుణులే అధికంగా ఉన్నారని పిటిషనర్లు పేర్కొన్నారు.















