అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి యూటర్న్ తీసుకున్నారు. ఇరాన్‌తో సీజ్‌ఫైర్ ఒప్పందాన్ని పొడిగించబోనని మంగళవారం ప్రకటించిన ఆయన, గంటల వ్యవధిలోనే మాట మార్చారు. మధ్యవర్తి పాకిస్థాన్ అభ్యర్థన మేరకు ఇరాన్‌తో కాల్పుల విరమణను నిరవధికంగా పొడిగిస్తున్నట్టు ప్రకటించారు. ఏడు వారాల యుద్ధాన్ని ముగించడానికి ఒక ఐక్య ప్రతిపాదనతో రావడానికి ఏకాభిప్రాయం కొరవడిన ఇరాన్ నాయకత్వానికి సమయం ఇచ్చేందుకే ఈ చర్య అని పేర్కొన్నారు. ఏప్రిల్ 8న ప్రకటించిన రెండు వారాల కాల్పుల విరమణ గడువు ముగిసిపోనున్న తరుణంలో అమెరికా నుంచి వెలువడిన ఈ నాటకీయ ప్రకటనను పాకిస్థాన్‌కు చెందిన అగ్ర నాయకత్వం స్వాగతించింది.

ఈ పొడిగింపుతో ఇరాన్ ప్రతినిధులతో శాంతి చర్చలు జరిపేందుకు ఇస్లామాబాద్ రావలసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం పర్యటన వాయిదాపడింది. వాన్స్, అమెరికా ప్రత్యేక దూతలు స్టీవ్ విట్కాఫ్, జారెడ్ కుష్నెర్ మంగళవారం ఇస్లామాబాద్‌కు ప్రయాణించవలసి ఉంది. తమ ప్రతినిధి బృందం పాక్ పర్యటన లేదని వైట్ హౌస్ ప్రకటించింది.















