అమెరికా అధ్యక్షుడుగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ న్యూయార్క్‌లోని హష్ మనీ కేసులో తనకు శిక్ష విధించడంలో జాప్యానికి చేసిన ప్రయత్నాన్ని ఏకాభిప్రాయం లేని సుప్రీం కోర్టు తిరస్కరించింది. 54తో కోర్టు వెలువరించిన ఉత్తర్వు వల్ల ట్రంప్‌కు జడ్జి జువాన్ ఎం మెర్చన్ శిక్ష విధించేందుకు మార్గం సుగమం అయింది. పోర్న్ నటి స్టార్మీ డేనియల్స్ కు లక్షా 30 వేల డాలర్ల హష్ మనీ చెల్లింపును గోప్యంగా ఉంచేందుకు చేసిన యత్నంగా ప్రాసిక్యూటర్లు పేర్కొన్న కేసులో దోషిగా ట్రంప్‌ను నిర్ధారించడమైంది. డేనియల్స్‌తో తనకు సంబంధంలేదని, తాను ఏ తప్పూ చేయలేదని ట్రంప్ వాదించారు.
ట్రంప్ అత్యవసర పిటిషన్‌ను తిరస్కరించడంలో కోర్టులోని ముగ్గురు సరళస్వభావ న్యాయమూర్తులతో ప్రధాన న్యాయమూర్తి జాన్ రాబర్ట్, న్యాయమూర్తి అమీ కోనీ బారెట్ కలిశారు. ట్రంప్‌కు జైలు శిక్ష, జరిమానా లేదా ప్రోబేషన్ విధించబోనని మెర్చన్ సూచించినందును ఆయనకు విధించే శిక్ష కఠినంగా ఉండబోదని వారు పేర్కొన్నారు. ఈ లోగా తీర్పునకు వ్యతిరేకంగా ట్రంప్ వాదనలను మామూలు అప్పీళ్ల ప్రక్రియలో భాగంగా విచారించవచ్చునని మెజారిటీ న్యాయమూర్తులు భావించారు. న్యాయమూర్తులు క్లారెన్స్ థామస్, సామ్యూల్ అలిటో, నీల్ గోర్సుచ్, బ్రెట్ కవనాఫ్ శిక్ష విధింపును ఆలస్యం చేసి ఉండేవారని తీర్పు పేర్కొన్నది.