అమెరికాలో ఉద్యోగం చేయాలనుకునే వారికి డొనాల్డ్ ట్రంప్ భారీ షాక్ ఇచ్చారు. విదేశీ నిపుణుల నియామకానికి జారీ చేసే హెచ్-1బీ వీసా దరఖాస్తులపై వార్షిక రుసుంను లక్ష డాలర్లకు పెంచారు. ఈ మేరకు కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకం చేశారు. దీంతో అమెరికా వేదికగా పనిచేస్తున్న కంపెనీలు విదేశీ నిపుణులను నియమించుకునేందుకు జారీ చేసే ఒక్కొక్క వీసాపై ఇకపై ఏడాదికి లక్ష డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. చెల్లింపులకు కంపెనీలు సిద్ధంగా లేనట్లయితే వర్క్ వీసాపై వెళ్లేవారు ఇంటి ముఖం పట్టాల్సిందే. దీని ప్రభావం భారతీయ వృత్తి నిపుణులు, నైపుణ్యం కలిగిన చైనా కార్మికులపై ఆధారపడే టెక్ రంగంపై అధికంగా ఉండనుంది.

అగ్రరాజ్యంలో మాస్టర్స్ ప్రోగ్రామ్ చేయాలనుకునే భారతీయుల ఆశలు ఆవిరయ్యే ప్రమాదం ఉన్నది. ప్రతి హెచ్-1బీ వీసాపై ఏడా లక్ష డాలర్లు రుసుం విధించినట్లు అమెరికా కామర్స్ సెక్రటరీ హోవార్డ్ లుట్నిక్ వెల్లడించింది. దీనికి సంబంధించి ఇప్పటికే అన్ని పెద్ద కంపెనీలకు వివరించామన్నారు. ఎరికైనా శిక్షణ ఇవ్వాలనుకుంటే ఇక్కడి గొప్ప యూనివర్సిటీల నుంచి పట్టభద్రులైన అమెరికన్లకు ఇవ్వాలని కంపెనీలను ఉద్దేశించి అన్నారు. ఇక్కడి ఉద్యోగాలను కొల్లగొడుతున్న వారిని ఇతర దేశాల నుంచి తీసుకురావడం ఆపాలని సూచించారు. తాము తీసుకున్న నిర్ణయానికి టెక్నాలజీ రంగం మద్దతు ఇస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. వారు చాలా సంతోషిస్తారని చెప్పారు.
















