భారతీయ వస్తువులపై భారీ సుంకాలను విధించిన తర్వాత మరో కొత్త రంగంపై సుంకాలు విధించే అంశాన్ని అమెరికా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు కనపడుతోంది. ఐటీ సేవలు, విదేశాల్లో ఉండి పనిచేసే టెకీలు, ఔట్‌సోర్సు ద్వారా సాగే వ్యాపార కార్యకలాపాలు తదితర ఐటీ రంగానికి చెందిన సేవలపై ట్రంప్ ప్రభుత్వం సుంకాలు విధించే అవకాశం ఉన్నది.

హెచ్-1బీ వీసా ప్రోగ్రామ్ ప్రక్షాళన, గ్రీన్‌కార్డుదారులు, తాత్కాలిక వీసా ఉద్యోగులు పంపించే సొమ్ముపై సుంకం పెంపు వంటి ప్రతిపాదనలను కూడా అమలు చేయడం ద్వారా భారత్‌ను ఆర్థికంగా దెబ్బతీయాలని డొనాల్డ్ ట్రంప్ సర్కార్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. సిలికాన్ వ్యాలీ, అమెరికాలో ఐటీ బూమ్ మీద ఆధారపడిన ఇంజనీర్లు, కోడింగ్ నిపుణులు, విద్యార్థులతోసహా భారతీయ మానవ వనరులను అడ్డుకోవడమే లక్ష్యంగా అమెరికా పావులు కదుపుతున్నట్లు సమాచారం. అన్ని ఔట్‌సోర్సింగ్‌లపై సుంకాలు విధించాలని, వస్తువుల తరహాలోనే అమెరికాకు ఎక్కడో ఉండి సేవలు అందచేస్తూ లాభపడుతున్నందుకు ఇతర దేశాలు మూల్యం చెల్లించుకోవాలని కన్జర్వేటివ్ వ్యాఖ్యాత జాక్ పోసోబీక్ తెలిపారు.















