చైనా రియల్ ఎస్టేట్ సంస్థ ఎవర్ గ్రాండే కు హాంకాంగ్ కోర్టు గట్టి షాక్ ఇచ్చింది. పునర్వ్యవస్థీకరణ ప్రణాళికల ప్రకారం రుణ దాతలకు వాయిదాల చెల్లింపులో విఫలమైనందున సంస్థను లిక్విడేట్) చేయాలని ఆదేశించిం ది. రుణ దాతల పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక అమలు చేయలేకపోవడం తోపాటు దివాళా దిశగా అడుగు లేస్తున్న ఎవర్ గ్రాండే సంస్థను మూసేయడం మంచిదని పేర్కొంటూ కోర్టు న్యాయమూర్తి లిండా చాన్ ఆదేశాలు జారీ చేశారు.
ఎవర్ గ్రాండే లిక్విడేషన్‌కు జారీ చేసిన ఆదేశాలతో చైనా ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. చైనా స్టాక్ మార్కెట్లో వివిధ సంస్థల స్టాక్స్ పై అమ్మకాల ఒత్తిళ్లు పెరుగుతాయని భావిస్తున్నారు. ఎవర్ గ్రాండే లిక్విడేషన్ ప్రక్రియ చేపడితే చైనాలో రియాల్టీ రంగం బిజినెస్ మీద విశ్వాసం సన్నగిల్లే అవకాశం ఉందని చెబుతున్నారు. 300 బిలియన్ డాలర్ల అప్పులపై కొత్త రుణాల పునర్వ్యవస్థీకరణ ప్రణాళిక కోసం ప్రయత్నిస్తున్నట్లు ఎవర్ గ్రాండే తెలిపారు. అయితే, క్రెడిటర్ల తరపున విచారణకు హాజరైన న్యాయవాది పెర్గస్ సౌరిన్ స్పందిస్తూ ఎవర్ గ్రాండే వాదన ఆశ్చర్యకరంగా లేదన్నారు. ఎవర్ గ్రాండే మూసివేతకు దారి తీసిన పరిస్థితులపై ఆ సంస్థ యాజమాన్యమే బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు.