తెలంగాణ కేంద్రంగా చలనచిత్ర పరిశ్రమల అభివృద్ధి చెందడానికి, సినిమాలకు సంబంధించి అవసరమైన అన్ని రకాల అనుమతుల కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఐటీ, ఫార్మా పరిశ్రమలకు కేంద్రంగా ఉన్నట్టుగానే హైదరాబాద్‌ను గ్లోబల్ సినీ హబ్ గా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని చెప్పారు.హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ లో నిర్వహించిన తెలంగాణ గద్దర్ ఫిలిం అవార్డుల TGFA బహూకరణ కార్యక్రమానికి ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, పలువురు ఎంపీలు, సలహాదారులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, తెలంగాణ ఫిల్మ్ డెవల్మెంట్ చైర్మన్ దిల్ రాజు, చిత్ర పరిశ్రమకు చెందిన దిగ్గజాలు మెగాస్టార్ చిరంజీవి, కమల్ హాసన్, అక్కినేని నాగార్జున, రామ్ చరణ్, మాధురి దీక్షిత్,ఖుష్బు, జెనీలియా, జయసుధతో పాటు దర్శకులు, నిర్మాతలు, నటీనటులు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. ఐటీ, ఫార్మా తరహాలోనే సినిమా రంగాన్ని ఒక పరిశ్రమగా గుర్తించి పోత్సహించాలన్న ఆలోచన చేసిన కారణంగానే రాష్ట్రంలో గత పదేళ్లుగా ఆగిపోయిన నంది అవార్డుల స్థానంలో గద్దర్ పేరుతో అవార్డులను పునరుద్ధరించాం. ఆగిపోయిన 10 ఏళ్ల అవార్డులనూ బహూకరించాం.

రెండో విడతగా నిర్వహించుకుంటున్న ఈ కార్యక్రమంలో అవార్డు గ్రహీతలందరికీ తెలంగాణ ప్రభుత్వం తరఫున ప్రత్యేక అభినందనలు. గద్దర్ సినిమా అవార్డులను ప్రధానం చేయడం తెలంగాణ ప్రభుత్వం ఒక బాధ్యతగా భావించింది.

ఒకప్పుడు చెన్నై నుంచి హైదరాబాద్‌కు సినిమా పరిశ్రమ తరలిరావడానికి ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర రావు, రామానాయుడు, కృష్ణ తీవ్రమైన కృషి చేశారు. చార్మినార్‌కు నాలుగు మినార్లు ఎలాగో తెలుగు సినిమా పరిశ్రమ తరలి రావడానికి ఈ నలుగురు విశేషంగా కృషి చేశారు.


సినీ కార్మికుల కోసం నటుడు ప్రభాకర్ రెడ్డి తన సొంత స్థలాన్ని ఇళ్లు కట్టుకోవడానికి దానమిచ్చారు. పరిశ్రమలో ఏ సమస్య వచ్చినా, సంక్షోభం వచ్చినా పరిష్కరించడానికి దర్శకుడు దాసరి నారాయణ రావు గారు చేసిన కృషి గుర్తుచేసుకోవలసిన అవసరం ఉంది. రామోజీరావు గారు రామోజీ ఫిల్మ్‌సిటీ స్థాపించడంతో హైదరాబాద్‌లో సినిమా పరిశ్రమ శాశ్వతంగా వేళ్లూనుకోవడానికి కారణమైంది.

హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, తెలుగు అని కాకుండా పాన్ ఇండియా – భారతీయ సినిమా ఒక గ్లోబల్ హబ్‌గా పరిశ్రమ మొత్తం ఒకే గొడుగు కిందకు వచ్చి గొప్ప సినిమాలు అందించాల్సిన అవసరం ఉంది. హాలీవుడ్ సినిమాలను సైతం హైదరాబాద్ నగరానికి ఆహ్వానించి ఇక్కడి నుంచే నిర్మించేలా ఉన్నతంగా తీర్చిదిద్దుకుందాం.


ఓటీటీ ప్లాట్ ఫామ్ లో దిగ్గజ సంస్థ Netflix ఐలైన్ హైదరాబాద్ తన కేంద్రాన్ని ప్రారంభించింది. నెట్‌ఫ్లిక్స్ రాకతో హైదరాబాద్‌కు హాలీవుడ్ వచ్చినట్టే. అంతర్జాతీయ స్థాయిలో ఇక్కడ సినిమాల నిర్మాణం కోసం సింగిల్ విండో విధానం అమలు చేస్తాం. అందుకు త్వరలోనే ఒక ప్లాట్‌ఫామ్ క్రియేట్ చేస్తాం అన్నారు. ప్రత్యేక విభాగంలో కొణిదెల చిరంజీవి (ఎన్టీఆర్ జాతీయ పురస్కారం), సింగీతం శ్రీనివాస రావు (బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డు), చలసాని అశ్వినీదత్ (నాగిరెడ్డి – చక్రపాణి అవార్డు), సుద్దాల అశోక్ తేజ (డాక్టర్ సి. నారాయణరెడ్డి అవార్డు), జయసుధ (అక్కినేని నాగేశ్వరరావు అవార్డు), ఆర్ నారాయణ మూర్తి (కాంతారావు అవార్డు), అక్కినేని రమేష్ ప్రసాద్ (రఘుపతి వెంకయ్య అవార్డు), కమల్ హాసన్ (పైడి జైరాజ్ అవార్డు), ఉత్తమ నటుడు నాగ చైతన్య(తండేల్), ఉత్తమ నటిగా రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్)లతో పాటు వివిధ కేటగిరీల్లో విజేతలకు జ్ఞాపికలు, ప్రశంసాపత్రం, నగదు బహుమతిని అందించారు.
















