ప్రపంచ సంపన్నుల జాబితాలో ట్విట్టర్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ నెం.1 స్థానాన్ని కైవసం చేసుకున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ జాబితాలో మరోమారు తొలి స్థానానికి చేరుకున్నారు. లగ్జరీ ఉత్పత్తుల వ్యాపారవేత్త బెర్నార్డ్ ఆర్నాల్ట్‌ను వెనక్కు నెట్టి మరీ అపరకుబేరుడిగా నిలిచారు. బెర్నార్డ్‌కు చెందిన లగ్జరీ ఉత్పత్తుల సంస్థ ఎల్‌వీఎమ్‌హెచ్ షేర్ల విలువ బుధవారం ఏకంగా 2.6 శాతం పడిపోవడంతో ఆయన రెండో స్థానానికి పరిమితం కావాల్సి వచ్చింది.

మరోవైపు, టెస్లా షేర్లు రాణించడంతో మస్క్ సంపదలో వృద్ధి చోటుచేసుకుంది. మస్క్ ఆస్తుల్లో టెస్లా వాటా ఏకంగా 71 శాతం. ఈ ఏడాది ఇప్పటివరకూ టెస్లా షేర్ల ధరలు సుమారు 66 శాతం మేర పెరిగాయి. దీంతో, ఎలాన్ మస్క్ 192.3 బిలియన్ డాలర్ల సంపదతో ప్రపంచంలోనే అత్యంత ధనికుడిగా అవతరించారు. ప్రపంచం ఆర్థిక ఒడిదుడుకులకు లోనవుతున్న నేపథ్యంలో లగ్జరీ ఉత్పత్తులకు డిమాండ్ క్షిణిస్తోంది. ముఖ్యంగా చైనాలోని ఆర్థికమందగమనం ఎల్‌వీఎమ్‌హెచ్ కంపెనీ షేర్లపై ప్రతికూల ప్రభావం చూపింది.

