కృత్రిమ మేధ(ఏఐ)పై టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. వివాటెక్ 2024లో సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఏఐ వినియోగం వేగంగా విస్తరిస్తున్నందున ఇక భవిష్యత్తులో ఉద్యోగాలు కేవలం ఐచ్ఛికంగా మారిపోతాయని పేర్కొన్నారు. ఎవరైనా వ్యక్తులు ఉద్యోగాలను అలవాటుగా చేయాలనుకుంటే చేయవచ్చని, ఒకవేళ ఉద్యోగాలు చేయకపోయినా ఏఐ, రోబోలే మనకు కావాల్సిన అన్ని వస్తువులు, సేవలను అందిస్తాయని ఆయన అంచనా వేశారు. ఏఐతో మానవాళికి మేలు జరగాలంటే ఏఐ టూల్స్ నిజాలు మాత్రమే చెప్పేలా సిద్ధం చేయాలని ఆయన పేర్కొన్నారు. చాట్‌జీపీటీని రూపొందించిన ఓపెన్‌ఏఐ సంస్థ పట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు.
దేశ చరిత్రలోనే తొలిసారిగా ఓ ప్రభుత్వ టీవీ చానెల్‌లో కృత్రిమ మేధ(ఏఐ) ఆధారిత న్యూస్ యాంకర్లు రంగ ప్రవేశం చేయనున్నారు. రైతుల కోసం ప్రారంభించిన డీడీ కిసాన్ చానెల్‌కు తొమ్మిది సంవత్సరాలు పూర్తవు తున్న నేపథ్యంలో దూరదర్శన్ కీలక నిర్ణయం తీసుకొన్నది. ఈ కృత్రిమ మేధ ఆధారిత న్యూస్ యాంకర్లకు ఏఐ క్రిష్, ఏఐ భూమి అని పేర్లు పెట్టారు. ఈనెల 26 నుంచి వీటి చేత వార్తలు చదివిస్తారు.