ఉక్రెయిన్, రష్యా సంక్షోభం నేపథ్యంలో రష్యాలో చదువుకుంటున్న భారతీయ విద్యార్థులను ఉద్దేశించి అక్కడి భారతీయ రాయబార కార్యాలయం కీలక ప్రకటన చేసింది. భారతీయులు రష్యాను తక్షణం వీడాల్సిన భద్రతాపరమైన కారణాలేవీ లేవని పేర్కొంది. రష్యాలో కొనసాగాలా వద్దా అంటూ అనేక మంది భారతీయులు ఎంబసీని సంప్రదించిన నేపథ్యంలో రాయబార కార్యాలయం ఈ సూచన చేసింది. భారతీయుల భద్రతా సంబంధిత విషయాలపై తాము రష్యా అధికారులతో నిరంతరం చర్చిస్తున్నామని తెలిపింది. అయితే అక్కడి యూనివర్సిటీలు ఇప్పటికే ఆన్లైన్ విధానంలో పాఠ్యాంశాలు బోధిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు తగు నిర్ణయం తీసుకోవాలని సూచించింది. ఈ విషయంలో యూనివర్శిటీ అధికారులతో కూడా చర్చించవచ్చని పేర్కొంది. అయితే రష్యాలో బ్యాంకింగ్ సేవలతో పాటు అక్కడి నుంచి భారత్కు నేరుగా వెళ్లే విమానాల విషయంలో ఇబ్బందులు ఏర్పడుతున్న మాట వాస్తవమేనని, వీటిపై ఆందోళనతో ఉన్నవారు భారత్కు తిరిగి వెళ్లాలనుకుంటే వెళ్లొచ్చని సూచించింది.














