అమెరికాకు చెందిన యాపిల్ కంపెనీపై ప్రముఖ స్వీడిష్ కమ్యూనికేషన్ పరికరాల సంస్థ ఎరిక్సన్ కేసు పెట్టింది. రాయల్టీలు చెల్లించకుండా 5జీ వైర్లెస్ టెక్నాలజీని ఉపయోగిస్తుందంటూ ఆరోపించింది. ఇప్పటికే రెండు కంపెనీలు అమెరికాలో ఒకదానిపై ఒకటి కేసులు పెట్టుకున్నాయి. లైసెన్స్ గురించి మాట్లాడలేకపోవడంతో చివరకు రెండు కంపెనీలు కోర్టు వరకు వెళ్లాయి. ఎరిక్సన్ గతంలో అక్టోబర్‌లో యాపిల్‌పై కేసు పెట్టింది. యాపిల్ తన రాయల్టీని అన్యాయంగా తగ్గించిందని కంపెనీ పేర్కొంది. అదే సమయంలో పేటెంట్ పునరుద్ధరించాలంటూ బలవంతం చేస్తోందని ఆరోపిస్తూ డిసెంబర్లో ఆపిల్ ఎరిక్సన్పై దావా వేసింది. 2015లో జరిగిన ఏడేళ్ల టెలికాం పేటెంట్ ఒప్పందాన్ని పునరుద్ధరించుకునేందుకు మొదట రెండు కంపెనీలు చర్చలు ప్రారంభించాయి.
ఈ సందర్భంగా ఎరిక్సన్ ప్రతినిధి మాట్లాడుతూ 5జీ వైర్లెస్ టెక్నాలజీ వినియోగానికి సంబంధించి ఆపిల్‌తో తమ ఒప్పందం గడువు ముగిసిందని పేర్కొన్నారు. అయితే లైసెన్స్‌పై చర్చలు జరపలేకపోయాయన్నారు. యాపిల్ ఎరిక్సన్ సాంకేతికను ఉపయోగించడం చట్టవిరుద్ధమన్నారు. ప్రస్తుతం లైసెన్స్ లేకుండా టెక్నాలజీని వాడుకుంటున్నారని ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై యాపిల్ స్పందించలేదు.