బీజేపీ నేత నుపుర్‌శర్మ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసిన సంగతి తెలిసిందే. భారత్‌తో పాటు ఇతర దేశాల్లోనూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో కువైట్‌లో నిరసన ప్రదర్శన చేపట్టిన వారిపై అక్కడి ప్రభుత్వం తీవ్ర చర్యలకు ఉపక్రమించింది. ఆ ఆందోళనల్లో పాల్గొన్న ప్రవాసులను దేశం నుంచి వెంటనే పంపించాలని నిర్ణయించింది. స్థానిక చట్టాలను ప్రవాసులు ఉల్లంఘించినందుకు కువైట్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలిసింది. కువైట్‌కు వచ్చే ప్రవాసులు తప్పనిసరిగా అక్కడి చట్టాలు గౌరవించాల్సిందే. ఎటువంటి బైఠాయింపులు, నిరసన ప్రదర్శనలు జరపడం పాల్గొనడం నిషేధం.
అయితే నుపుర్‌శర్మ చేసిన అనుచిత వ్యాఖ్యలకు వ్యతిరేకంగా కువైట్‌లోని ఫహాహిల్ ప్రాంతంలోని కొందరు వ్యక్తులు ప్రార్థనల అనంతరం నిరసన ప్రదర్శన చేపట్టారు. దీనిని తీవ్రంగా పరిగణించిన అక్కడి ప్రభుత్వం అందులో ప్రవాసులను గుర్తించి వెంటనే అరెస్టు చేయాలని ఆదేశించింది. దీంతో రంగంలోకి దిగిన అధికారులు నిరసన కార్యక్రమంలో పాల్గొన్న ప్రవాసులను అరెస్టుచేసే పనిలో నిమగ్నమయ్యారు. అంతేకాకుండా వారిని ఆయా దేశాలకు పంపించే ప్రక్రియను ముమ్మరం చేశారు. అయితే, ఇలా దేశ బహిష్కరణ గురయ్యే ప్రవాసుల్లో ఏయే దేశాలకు చెందినవారు ఉన్నారనే విషయాన్ని మాత్రం కువైట్ అధికారులు వెల్లడిరచలేదు.














