నాగశౌర్య కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి. మాళవిక నాయర్ కథానాయిక. శ్రీనివాస్ అవసరాల దర్శకుడు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ పతాకాలపై టీజీ విశ్వప్రసాద్, పద్మజ దాసరి నిర్మిస్తున్నారు. ప్రీరిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించడంతో పాటు చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో నాకిది మూడో చిత్రం. ఈ సినిమా ఖచ్చితంగా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది. కల్యాణిమాలిక్‌గారు పాటలు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ప్రాణం పోశారు. ఈ సినిమా రికార్డులు బద్దలు కొడుతుందని చెప్పను కానీ, మీ అందరి మనసుల్ని గెలుచుకుంటుంది. దీని తర్వాత పది ఫ్లాపులు తీసినా క్షమిస్తారు. అంత మంచి సినిమా ఇది అన్నారు. దర్శకుడు శ్రీనివాస్ అవసరాల మాట్లాడుతూ ఈ సినిమా కోసం భాస్కరభట్ల, లక్ష్మీభూపాల అద్భుతమైన పాటల్ని అందించారు. కల్యాణిమాలిక్ సంగీతం ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటున్నది. దర్శకుడిగా నా కెరీర్‌లో ఎంతో ప్రత్యేకమైన చిత్రమిది అన్నారు. చక్కటి ప్రేమకథా చిత్రంలో భాగం కావడం ఆనందంగా ఉందని కథానాయిక మాళవిక నాయర్ పేర్కొంది. కథానుగుణంగా మంచి పాటలు కుదిరాయని సంగీత దర్శకుడు కల్యాణి మాలిక్ చెప్పారు. ఈ సినిమా ఈ నెల 17న విడుదలకానుంది. ఈ కార్యక్రమంలో దర్శకులు బాబీ కొల్లి, మారుతి, నందిని రెడ్డి, కోన వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
