Namaste NRI

16 రాష్ట్రాలకు బిజెపి అభ్యర్థుల ఖరారు.. తెలంగాణ నుంచి ముగ్గురు సిట్టింగ్‌లకు ఛాన్స్!

పార్లమెంట్‌ ఎన్నికల్లో మెజార్టీ స్థానాలను కైవసం చేసుకోవడమే లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ దూకుడు పెంచుతోంది. వచ్చే లోక్‌సభ ఎన్నికలు దగ్గర పడుతున్నాయి. లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థులను బిజెపి కేంద్ర ఎన్నికల కమిటీ(సిఇసి) 16 రాష్ట్రాల కోసం పార్టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ దాదాపు పూర్తయినట్లు తెలుస్తోంది. తొలి జాబితాలోనే ప్రముఖులకు చోటు దక్కనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డా సభ్యులు గా గల సిఇసి పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశమై చర్చలు జరిపింది. ఉత్తర్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్, అస్సాం, ఛత్తీస్‌గఢ్, ఢిల్లీ, గోవా, ఉత్తరాఖండ్, తెలంగాణతోపాటు మరికొన్ని రాష్ట్రాల నుంచి బరిలో నిలిపే అభ్యర్థులను ఈ సమావేశంలో నిర్ణయించినట్లు తెలుస్తోంది.

ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తుతం వారణాసి నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండగా అమిత్ షా గుజరాత్‌లోని గాంధీ నగర్ నుంచి, రాజ్‌నాథ్ సింగ్ ఉత్తర్ ప్రదేశ్‌లోని లక్నో నుంచి లోక్‌సభలో ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వీరితో పాటు ప్రస్తుతం రాజ్యసభ సభ్యులుగా ఉన్న మరికొందరు కేంద్ర మంత్రులు కూడా లోక్‌సభ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఉంది. వీరికి కూడా తొలి జాబితాలోనే చోటు దక్కే అవకాశం ఉంది. తొలి జాబితాలో 110 మంది కి పైగా అభ్యర్థుల పేర్లు ఉండనున్నట్లు వర్గాలు తెలిపాయి. బిజెపికి ప్రధాన మిత్రపక్షాలు ఉన్న బీహార్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాలు లేదా పొత్తులు ఇంకా కుదరని ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాలు ఇప్పటివరకు చర్చకు రాలేదని తెలుస్తోంది.

ఉత్తర్ ప్రదేశ్‌లో ఆరు సీట్లను మిత్రపక్షాలకు వదిలిపెట్టాలని బిజెపి భావిస్తోంది. జయంత్ సింగ్ సారథ్యంలోని ఆర్‌ఎల్‌డి ఇంకా బిజెపి సారథ్యంలోని ఎన్‌డిఎలో చేరనప్పటికీ ఆయన ఇందుకు తగ్గ సూచనలు పంపించా రు. అనేక స్థానాలకు అభ్యర్థులను సిఇసి ఖరారు చేసినప్పటికీ వాటిలో చాలా పేర్లు తొలి జాబితాలో ఉండక పోవచ్చని వర్గాలు వెల్లడించాయి. కేంద్ర మంత్రులు రాజీవ్ చంద్రశేఖర్, భూపేందర్ యాదవ్, మాన్సుఖ్ మాండవీయ, ధర్మేంద్ర ప్రధాన్, జ్యోతిరాదిత్య సింధియా, పరుషోత్తం రూపాలా బరిలో అభ్యర్థులుగా నిలవను న్నారు. కేరళలోని తిరువనంతపురం నుంచి ఎన్నికైన కాంగ్రెస్ ఎంపి శశి థరూర్‌పైన రాజీవ్ చంద్రశేఖర్‌ను నిలిపే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు సాగుతున్నాయి.

తెలంగాణకు చెందిన నలుగురు బిజెపి ఎంపీలలో ముగ్గురి పేర్లు ఖరారైనట్లు వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి, బండి సంజయ్ కుమార్, ధర్మపురి అరవింద్ ప్రస్తుతం తాము ప్రాతినిధ్యం వహిస్తున్న సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్ నుంచే పోటీ చేయనున్నట్లు వారు చెప్పారు. ఎన్నికల షెడ్యూల్‌ను ఎన్నికల సంఘం ప్రకటించడానికి ముందే లోక్‌సభ అభ్యర్థుల జాబితాను విడుదల చేయాలని బిజెపి యోచిస్తున్నట్లు తెలుస్తోంది.

Social Share Spread Message

Latest News

Our Advertisers

Previous slide
Next slide

తాజా వార్తా చిత్రాలు

NRI Events

Powered by WordPress