ప్రియదర్శి, కావ్య కళ్యాణ్ రామ్, సుధాకర్ రెడ్డి, మురళీధర్ గౌడ్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా బలగం. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రొడక్షన్స్పై శిరీష్ సమర్పణలో హర్షిత్ రెడ్డి, హన్షిత నిర్మించారు. వేణు యెల్దండి దర్శకత్వం వహించారు. గత నెల విడుదలైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలతో పాటు పలు అంతర్జాతీయ అవార్డులను అందుకుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చిత్ర యూనిట్ సంతోషాన్ని వ్యక్తం చేసింది. నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ బలగం ఒక చరిత్రను సృష్టించింది. తెలుగు సినిమాకు మైలురాయిలా మారింది. ఊళ్లలో సినిమాలు చూసే అలవాటు నా చిన్నతనంలో చూశా. కానీ ఇప్పుడు మా చిత్రంతో మొదలైంది. ఓటీటీకి సినిమా అమ్మాం కాబట్టి కొందరు అక్రమంగా డౌన్లోడ్ చేసి సినిమాను ప్రదర్శిస్తున్నారని వాళ్ల దగ్గర నుంచి మాకు లెటర్స్ వచ్చాయి. అందుకు మేము లీగల్ నోటీస్ ఇచ్చాం కానీ సినిమాను ఆపాలని కాదు. మీకు అందుబాటులో లేకుంటే మేమే సినిమా చూసే ఏర్పాటు చేస్తాం. మహర్షి, శతమానం భవతి చిత్రాలకు నేషనల్ అవార్డ్ వస్తుందని నేను ఊహించలేదు. కానీ ఈ సినిమాకు జాతీయ పురస్కారం వస్తుందని అంతా అంటున్నారు. ప్రేక్షకాదరణ కంటే ఏ పురస్కారం గొప్పది కాదు. పొలిటికల్ ఆఫర్స్ ఉన్నాయి. కానీ రాజకీయాల్లో నిత్యం ఉండే విమర్శలను నేను ఎదుర్కోలేను అన్నారు.

దర్శకుడు వేణు యెల్దండి మాట్లాడుతూ మున్నా సినిమాలో టిల్లు అనే పాత్ర ద్వారా నాకు నటుడిగా గుర్తింపు వచ్చింది. ఇన్నేండ్లకు మళ్లీ ఈ సినిమాతో పేరు తెచ్చుకున్నా. ఈ రెండు చిత్రాలకు నిర్మాత దిల్ రాజు అవడం, మా మధ్య ఏదో రుణానుబంధం ఉన్నట్లు అనిపిస్తున్నది. ఆయన లేకుంటే ఈ సినిమా ఇంత ఘన విజయం సాధించేది కాదు. దర్శకుడిగా నా రెండో సినిమా కూడా దిల్ రాజు సంస్థలోనే చేస్తున్నా.మా చిత్రానికి ప్రేక్షకుల ప్రశంసలు, అంతర్జాతీయ పురస్కారాలు దక్కడం సంతోషంగా ఉంది అన్నారు. నటుడు ప్రియదర్శి మాట్లాడుతూ బలగం ఒక సాంస్కృతిక విప్లవం అని ప్రశంసలు వస్తుంటే మా సినిమా ఇంత ఘనత సాధించిందా అనిపిస్తున్నది. ఓటీటీలో వచ్చాక మరింత చేరువైంది. మా సినిమాకు ఏడు అంతర్జాతీయ అవార్డులు వచ్చాయి. మరికొన్ని పురస్కారాల పోటీలో ఉన్నాం అన్నారు.
