
పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ హత్యకు గురైనట్లు సంచలన వార్తలు వెలువడుతున్నాయి. రావల్పిండిలోని అదియాలా జైలులో ఆయనను చిత్రహింసలకు గురిచేసి చంపివేసినట్లు కథనాలు వెలువడ్డాయి. పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్, నిఘా సంస్థ ఐఎస్‌ఐ సంయుక్తంగా కుట్రకు పాల్పడి ఇమ్రాన్ ఖాన్‌ను హత్య చేసినట్లు బలూచిస్థాన్ విదేశీ వ్యవహారాల శాఖ ఆరోపించింది. కారాగారం వెలుపల పెద్ద సంఖ్యలో గుమికూడిన ఇమ్రాన్ ఖాన్ అభిమానుల ఫొటోలు సైతం సోషల్ మీడియాను ముంచెత్తాయి. ఇమ్రాన్ ఖాన్‌ను బంధించిన జైలులోకి వెళ్లేందుకు ప్రయత్నించిన ఆయన సోదరీమణులు, ఇతర కుటుంబ సభ్యులను అధికారులు అనుమతించలేదంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది. దీంతో ఇమ్రాన్ ఖాన్‌ను హతమార్చి ఉంటారన్న అనుమానాలు మరింత బలపడుతున్నాయి. అయితే ఈ వార్తలకు ఎటువంటి అధికారిక ధ్రువీకరణ లభించలేదు.
















