భారత్, బ్రిటన్ మధ్య ప్రతిపాదిత స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్‌టీఏ) చర్చలు లాంఛనంగా ప్రారంభమయ్యాయి. కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రి పియుష్ గోయల్, బ్రిటన్ అంతర్జాతీయ వాణిజ్య శాఖ మంత్రి యానీమేరీ ట్రెవిల్యాన్ ప్రారంభించారు. రెండు పక్షాలు వ్యాపార అవకాశాలు అందిపుచ్చుకునేందుకు, భారత్, బ్రిటన్ మధ్య వస్తు, సేవల లావాదేవీల పరిమాణాన్ని పెంచుకునేందుకు తొడ్పడేలా వీలైనంత త్వరగా ఒప్పందం కుదిరేలా ఇరు దేశాల బృందాలు క్రియాశీలకంగా వ్యవహరించగలవని ఆశిస్తున్నట్లు గోయల్ తెలిపారు.
తొలి విడత చర్చలు పూర్తి స్థాయిలో జనవరి 17 నుంచి ప్రారంభమవుతాయి. ఆ తర్వాత ప్రతి అయిదు వారాలకోసారి ఇరు దేశాల బృందాలు సమావేశమవుతాయి. 2022 డిసెంబర్ నాటికి చర్చలను ముగించాల్సి ఉంఉటంది. 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని రెట్టింపు చేసుకునేందుకు, ఇరు దేశాల మధ్య ఆర్థిక సంబంధాలను మరింత మెరుగుపర్చుకునేందుకు తొడ్పడటం ఈ ఒప్పందం లక్ష్యం. ముందుగా సుదీర్ఘ సమయం పట్టేసే సున్నితమైన అంశాల జోలికి పోకుండా, ఇరు దేశాలకు ఆమోదకరంగా, ప్రయోజనకరంగా ఉండే విషయాలపైనే దృష్టి పెట్టాలని నిర్ణయించినట్లు గోయల్ తెలిపారు.














