రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన చిత్రం గేమ్ ఛేంజర్. అంజలి, కియారా అద్వాని కథానాయికలు. దిల్‌రాజు, శిరీష్ నిర్మించిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 10న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్రం ట్రైలర్ లాంచ్ కార్యక్రమం హైదరాబాద్‌లో జరిగింది. దర్శకడు ఎస్.ఎస్.రాజమౌళి అతిథిగా విచ్చేసి మాట్లాడారు. పదేళ్లుగా మేమంతా పానిండియా సినిమాలు చేస్తున్నాం. కానీ మేం గొప్పగా ఫీలయ్యే దర్శకుడు శంకర్. ఆయన మా అందరికీ ఓజీ(ఒరిజినల్ గ్యాంగ్‌స్టర్). నాతో సహా ఎంతోమంది దర్శకులకు ఆయనే స్పూర్తి. పెద్ద పెద్ద కలలను తెరపై ఆవిష్కరించేందుకు భయపడాల్సిన అవసరం లేదనే నమ్మకాన్ని ఓ జనరేషన్‌కి కలిగించాయి ఆయన సినిమాలు. గేమ్‌ఛేంజర్ లోని ఓ సన్నివేశం నాకు ఒకేఒక్కడు సినిమాను గుర్తుచేసింది. అంతకు పదింతలు ఈ సినిమా అలరిస్తుంది. రామ్‌చరణ్ ఈ సినిమాతో హీరోగా మరింత ఎత్తుకు ఎదుగుతాడు అని అన్నారు.
ఒక్కడు, పోకిరి సినిమాలు నాకిష్టం. అలాంటి సినిమానే గేమ్ ఛేంజర్. అయితే నా సినిమాలో ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ ఇందులో ఉంటాయి. ఓ ప్రభుత్వ అధికారి, ఓ రాజకీయ నాయకుడు మధ్య జరిగే యుద్ధమే ఈ సినిమా. ఇందులో హీరో ఫ్లాష్‌బ్యాక్ ఆడియన్స్‌పై ప్రభావం చూపుతుంది. చాలామంది ఈ సంక్రాంతిని శంకరాత్రి అంటున్నారు. కానీ నన్నడిగితే ఇది రామ్ నవమి. అంతబాగా చేశాడు ఇందులో రామ్‌చరణ్. కార్తిక్ సుబ్బరాజ్ అద్భుతమైన కథ ఇచ్చారు. ఇండియన్ సినిమావైపు హాలీవుడ్ చూసేలా చేసిన రాజమౌళి మా ట్రైలర్‌ను విడుదల చేయడం ఆనందం గా ఉంది అని శంకర్ పేర్కొన్నారు. గేమ్‌ఛేంజర్‌లోని కొన్ని సీన్స్ చూశాక తొడ కొట్టాలనిపించిందని దిల్‌రాజు చెప్పారు.
చివరిగా రామ్‌చరణ్ మాట్లాడుతూ మూడేళ్లల్లో సుకుమార్, రాజమౌళి, శంకర్ లాంటి ముగ్గురు గొప్ప దర్శకులతో పనిచేసే అవకాశం లభించింది నాకు. ఇది నిజంగా దేవుడిచ్చిన వరం. అందరం ప్రాణం పెట్టి పనిచేశాం. తమన్ పాటలు, సాయిమాధవ్ మాటలు అలరిస్తాయి అని తెలిపారు. ఈ వేడుకలో తమన్, శిరీష్, ఎస్.జె.సూర్య, సముద్రఖని, సాయిమాధవ్ బుర్రా పాల్గొన్నారు.