జనరల్ బిపిన్ రావత్ అకాల మరణంతో ఖాళీ అయిన సీడీఎస్ స్థానాన్ని భర్తీ చేసేందుకు కేంద్రం కసరత్తులు మొదలు పెట్టింది. ఆర్మీ చీఫ్ జనరల్ ఎంఎం నరవణే రేసులో ముందున్నారు. ఐదు నెలల్లో పదవీ విరమణ పొందనున్న నరవణే సీడీఎస్ పోస్టుకు అర్హుడని రిటైర్డ్ మిలిటరీ కమాండర్లు కూడా సూచిస్తున్నారు. సీడీఎస్‌ను ఎంపిక చేసేందుకు ఆర్మీ, నేవీ, వాయుసేనల నుంచి సీనియర్ కమాండర్లతో కూడిన ప్యానెల్‌ను కేంద్రం ఏర్పాటు చేయనుంది. ఆర్మీ చీఫ్‌గా జనరల్ రావత్ నుంచే ఆయన 2019 డిసెంబరు 31న బాధ్యతలు చేపట్టారు. నేవీ అధిపతి అడ్మిరల్ ఆర్.హరి కుమార్ కేవలం ఎనిమిది రోజుల క్రితం, వాయుసేన అధిపతి ఎయిర్ చీఫ్ మార్షల్ వివేక్ రామ్ చౌదరి సెప్టెంబరు 30న బాధ్యతలు చేపట్టారు. ఈ దృష్ట్యా జనరల్ నరవణెకే అవకాశాలు అధికంగా ఉన్నట్టు భావిస్తున్నారు.