తెలుగు భాషకు విశిష్ట సేవలందించిన గిడుగు వెంకట రామమూర్తి జయంతిని సంద్భంగా తెలుగు భాషా దినోత్సవాన్ని దక్షిణాఫ్రికాలోని జొహెన్స్బర్గ్లో ఘనంగా నిర్వహించారు. స్థానిక డ్రీమ్ హిల్స్ ఇంటర్నేషనల్ స్కూల్ ప్రాంగణంలో వేడుకలను నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా, తెలంగాణా అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఆఫ్రికా , దక్షిణాఫ్రికా తెలుగు సంఘం సంయుక్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమం ఆద్యంతం కోలాహలంగా సాగింది . పలు ప్రాంతాల నుంచి తరలి వచ్చిన ప్రవాస తెలుగు బాల,బాలికలు , మహిళలు పాడిన పాటలు, పద్యాలతో ఆహూతులను అలరించాయి.

తెలుగు సాహిత్యం, తెలుగు వ్యాకరణం లోని పలు ప్రశ్నలతో సాగిన తెలుగు క్విజ్ కార్యక్రమం ఆకట్టుకుంది. పలువురు వక్తలు మాట్లాడుతూ తెలుగు భాష ఔన్నత్యాన్ని, తెలుగు సంస్కృతిని భావితరాలకు అందించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఇటీవల నిర్వహించిన పద్యాలు, ఉపన్యాసాల పోటీల్లో గెలుపొందిన చిన్నారులకు, నిర్వాహకులు బహుమతులు, ధ్రువపత్రాలు, పోటీల్లో ఆసక్తిగా పాల్గొన్న వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.















