కువైత్ ప్రభుత్వం ప్రవాసులకు గుడ్‌న్యూస్ చెప్పింది. వలసదారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించే కేంద్రాల పనివేళలు పొడిగిస్తూ ఆ దేశ ఆరోగ్యమంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ అధికార ప్రతినిధి అబ్దుల్లా అల్-సనద్ తాజాగా కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న మూడు సెంటర్లలో కూడా వర్కింగ్ అవర్స్ పెంచుతున్నట్లు వెల్లడించారు. అలీ సబా అల్-సలేం, అల్-జహ్రా, షువైఖ్ ప్రాంతాలలోని కేంద్రాలలో తాజాగా నిర్ణయించిన కొత్త పనిగంటలు ఉంటాయని ఆయన పేర్కొన్నారు. ఇకపై ఈ మూడు సెంటర్లలో ఉదయం 7.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 6.00 గంటల వరకు సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. వర్కింగ్ డేస్ అయిన ఆదివారం నుంచి గురువారం వరకు ఇవే పనివేళలు అమలులో ఉంటాయన్నారు.
ముఖ్యంగా గృహ కార్మికులు అన్ని ప్రవాస లేబర్ పరీక్షా కేంద్రాలలో ముందస్తు అపాయింట్‌మెంట్ లేకుండా పరీక్షలు చేయించుకోవచ్చు. అయితే, దీనికి వారి స్పాన్సర్ ఉండాల్సి ఉంటుంది. ఇతర దరఖాస్తుదారులు మాత్రం ముందస్తు అపాయింట్‌మెంట్ పొందడం తప్పనిసరి. ఇక ఈ పనిగంటల పొడిగింపు అనేది ఆరోగ్య కేంద్రాలపై పని ఒత్తిడిని తగ్గించడం, రోగులకు సౌకర్యవంతమైన సేవలను అందించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు అబ్దుల్లా అల్-సనద్ తెలిపారు.














