సౌదీ అరేబియా ఉమ్రా యాత్రికులకు గుడ్‌న్యూస్ చెప్పింది. అన్ని దేశాల వారికి ఉమ్రా వీసా గడువును ఒక నెల నుంచి మూడు నెలలకు పెంచుతున్నట్లు ప్రకటించింది. ఉమ్రా వీసాను అన్ని దేశాలకు చెందిన ఉమ్రా చేసే వారందరికీ ఒకటి నుండి మూడు నెలల వరకు పొడిగించినట్లు హజ్, ఉమ్రా మంత్రి డాక్టర్ తౌఫిక్ అల్-రబియా తెలిపారు. తాష్కెంట్లో తన రెండు రోజుల అధికారిక పర్యటన సందర్భంగా ఆయన ఈ ప్రకటన చేశారు. గత రెండు నెలల్లో ఉజ్బెకిస్తాన్ నుండి 36,000 మందికి పైగా యాత్రికులు ఉమ్రా నిర్వహించారని, వీరిలో ఎక్కువ మంది మదీనాను సందర్శించి అల్-రౌదా అల్-షరీఫాలో ప్రార్థనలు చేసినట్లు పేర్కొన్నారు. అలాగే మదీనాలోని మతపరమైన, చారిత్రక ప్రదేశాలను వారు సందర్శించారని తెలిపారు. ఇరు దేశాలు వివిధ రంగాలలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి, విశిష్ట సంబంధాలను మరింత బలపరుచుకోవడానికి అల్-రబియా పర్యటన సాక్ష్యంగా నిలిచిందని మంత్రి చెప్పారు. ప్రస్తుతం నుసుక్ ప్లాట్‌ఫారమ్ ద్వారా ఎలక్ట్రానిక్‌గా అందిస్తున్న అన్ని సేవలు, ప్రోగ్రామ్‌లను ఆటోమేట్ చేయడంతో పాటు విజిట్, ఉమ్రా వీసాలను త్వరగా జారీ చేయడంపై ప్రధానంగా చర్చలు జరిగాయి.