తమ దేశంలో విద్యను అభ్యసించేందుకు ఎదురుచూస్తున్న విదేశీ విద్యార్థులకు అమెరికా తీపి కబురు చెప్పింది. వారి విద్యాసంవత్సరం మొదలయ్యే ఏడాది ముందుగానే వీసాకు దరఖాస్తు చేసుకోవచ్చని తాజాగా ప్రకటించింది. గత నెల 26 నుంచి నూతన పాలసీ అమల్లోకి వచ్చిందని అమెరికా విదేశాంగశాఖ తెలిపింది. అమెరికాలో విద్యాభ్యాసం చేయాలనుకునే విదేశీ విద్యార్థులకు రెండు రకాల వీసాలు ఎఫ్, ఎం అనే పేరుతో జారీ చేస్తారు. ఒక నూతన విద్యార్థులకు 365 రోజుల ముందే ఈ ఎఫ్, ఎం వీసాలు జారీ చేస్తామని ఇండియాలో అమెరికా రాయబార కార్యాలయం వెల్లడించింది. ఏడాది ముందు వీసా జారీ అయినా కోర్సుల ప్రారంభం కావడానికి ముందు 30 రోజుల కంటే ఎక్కువ అమెరికాలో విదేశీ విద్యార్థులు బస చేయడానికి నిబంధనలు అనుమతించవని విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అంటే విదేశీ విద్యార్థి విద్యాసంస్థలో తన కోర్సు ప్రారంభానికి 30 రోజుల ముందు మాత్రమే బీ వీసా కింద అమెరికాలో ఎంటర్ కావడానికి అనుమతి ఇస్తారు.