అంతర్జాతీయ ఐటీ దిగ్గజం గూగుల్‌లో వర్క్ ఫ్రం హోం విధానాన్ని కొనసాగించడంపై ఆ సంస్థ మాజీ సీఈవో ఎరిక్ స్మిత్ విమర్శలు గుప్పించారు. ఓపెన్ ఏఐ లాంటి స్టార్టప్‌లతో పోలిస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రేసులో గూగుల్ చాలా వెనుకబడిపోయిందని, వర్క్ ఫ్రం హోం విధానం, ఉద్యోగులు వారానికి ఒక రోజు మాత్ర మే ఆఫీసుకు రావడమే ఇందుకు ముఖ్య కారణమని పేర్కొన్నారు.

ఇటీవల స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో జరిగిన ఓ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఉద్యోగ జీవితాన్ని సమతూకంగా ఉంచాలని గూగుల్ నిర్ణయించిందని, ఉద్యోగులు గెలవడం కంటే త్వరగా ఇంటికి వెళ్లడం, ఇంటి నుంచి పనిచేయడం చాలా ముఖ్యమైపోయిందని అన్నారు. ఈ మార్పు గూగుల్‌కు ప్రతికూలంగా మారిందని, మిగతా టెక్ కంపెనీల్లో ఉద్యోగులు గంటల తరబడి గొడ్డుచాకిరీ చేస్తూ కొత్త ఆవిష్కరణలతో గూగుల్‌కు పోటీ ఇస్తున్నారని చెప్పుకొచ్చారు. ఏఐ రేసులో వెనుకబడటంపై గూగుల్ ఇప్పటికైనా దృష్టి సారించాల్సిన అవసరమున్నదని స్పష్టం చేశారు.
