భారత సంతతికి చెందిన బ్రిటన్ ఆర్థిక మంత్రి రిషీ సునాక్, భారత పౌరసత్వమున్న ఆయన భార్య అక్షతా మూర్తి సండే టైమ్స్ వార్షిక బ్రిటిష్ కుబేరుల జాబితాలో మొట్టమొదటిసారిగా చోటు సంపాదించారు. సునాక్ దంపతులు 73 కోట్ల పౌండ్ల ఆస్తిపాస్తులతో జాబితాలో 222వ స్థానంలో నిలిచారు. 2874 కోట్ల పౌండ్ల సంపదతో హిందుజా సోదరులు అగ్రస్థానంలో నిలిచారు. వీరు కూడా భారత సంతతికి చెందినవారే. హిందూజా గ్లోబల్ సొల్యూషన్స్ వంటి కంపెనీలతో పాటు ఇందస్ ఇండ్ బ్యాంకు, చెన్నైలోని అశోక్ లేలాండ్, ఐటీ సంస్థ హిందుజా గ్లోబల్ సొల్యూషన్స్ వంటి కంపెనీలతోపాటు ఇతర కంపెనీల షేర్లలో పెట్టిన పెట్టుబడులు హిందుజా సోదరులను అగ్రస్థానంలో కూర్చోబెట్టాయి.
బ్రిటన్‌కు చెందిన సర్ జేమ్స్ డైసన్ కుటుంబం 2300 కోట్ల పౌండ్లతో రెండో స్థానంలో నిలవగా, మూడో స్థానాన్ని తిరిగి భారత సంతతికి చెందిన రూబెన్ సోదరులు కైవసం చేసుకున్నారు. వారి ఆస్తిపాస్తులు 2226 కోట్ల పౌండ్లు. 1700 కోట్ల పౌండ్లతో ప్రవాస భారతీయ పారిశ్రామికవేత్త లక్ష్మీ మిత్తల్ ఆరో స్థానంలో నిలిచారు. 16వ స్థానంలో లోహాల వ్యాపారి అనిల్ అగర్వాల్, 39వ స్థానంలో చిల్లర వర్తక దిగ్గజాలు మొహసిన్, జుబేర్ ఇస్తా ఉన్నారు. టాప్ 100 జాబితాలో లార్డ్ స్వరాజ్ పాల్, బయోకాన్ వ్యవస్థాపకులు కిరణ్ మజుందార్ షా, ఆమె భర్త జాన్ షా (75 ర్యాంకు) ప్రభృతులు ఉన్నారు. ఈ ఏడాది సండే టైమ్స్‌లో సంపన్నుల జాబితాలో కొత్తగా ఆరుగురు వచ్చి చేశారు. 34 ఏళ్ల నుంచి ప్రచురితమవుతున్న ఈ జాబితాలో ఒక అగ్రశ్రేణి రాజకీయ నాయకుడి పేరు చోటు చేసుకోవడం ఇదే ప్రథమం.