టోర్నీలో అడుగు పెట్టిన తొలి ఏడాదే అద్వితీయ ప్రదర్శనతో గుజరాత్ టైటాన్స్ ఐపీఎల్-15వ సీజన్ టైటిల్ కైవసం చేసుకుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ అంతర్జాతీయ స్టేడియంలో ఆదివారం జరిగిన మెగా ఫైనల్లో గుజరాత్ టైటాన్స్ 7 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్‌ను ఓడించి ఐపీఎల్ చరిత్రలో ఏడవ చాంపియన్‌గా అవతరించింది. లీగ్ ఆరంభం నుంచే నిలకడైన ఆటతీరు కనబర్చిన హార్దిక్ సేన సొంతగడ్డపై లక్ష మందికి పైగా అభిమానుల మధ్య జరిగిన పోరులో దుమ్మురేపింది.
మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 130 పరుగులు చేసింది. తాజా సీజన్‌లో నాలుగు శతకాలతో జోరు మీదున్న స్టార్ ఓపెనర్ జోస్ బట్లర్ (35 బంతుల్లో 39; 5 ఫోర్లు) టాప్ స్కోరర్‌గా నిలువగా.. యశస్వి జైస్వాల్ (22) ఫర్వాలేదనిపించాడు. కెప్టెన్ సంజూ శాంసన్ (14), దేవదత్ పడిక్కల్ (2), హెట్‌మైర్ (11), అశ్విన్ (6), పరాగ్ (15) విఫలమయ్యారు. గుజరాత్ బౌలర్లలో హార్దిక్ పాండ్యా 3, సాయికిషోర్ రెండు వికెట్లు పడగొట్టారు.
అనంతరం లక్ష్యఛేదనలో గుజరాత్ 18.1 ఓవర్లలో 3 వికెట్లకు 133 పరుగులు చేసింది. వృద్ధిమాన్ సాహా (5), మాథ్యూ వేడ్ (8) విఫలమైనా.. శుభ్‌మన్ గిల్ (45 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్), హార్దిక్ పాండ్యా (34; 3 ఫోర్లు, ఒక సిక్సర్), డెవిడ్ మిల్లర్ (32 నాటౌట్; 3 ఫోర్లు, ఒక సిక్సర్) ఆకట్టుకోవడంతో గుజరాత్ ఆడుతూ పాడుతూ మ్యాచ్ ముగించింది. రాజస్థాన్ బౌలర్లలో బౌల్ట్, చాహల్, ప్రసిద్ధ్ కృష్ణ తలా ఒక వికెట్ పడగొట్టారు. రాజస్థాన్ బ్యాటింగ్‌ను కకావికలం చేసిన హార్దిక్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’అవార్డు దక్కింది. బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మరియు బోర్డు కార్యదర్శి జై షా ట్రోఫీ ప్రదానం చేశారు.