అమెరికాలో మరోసారి కాల్పుల ఘటన చోటుచేసుకున్నది. రోడ్ ఐలాండ్‌లోని బ్రౌన్ యూనివర్సిటీ ఇంజినీరింగ్ బిల్డింగ్‌లో పరీక్ష జరుగుతుండగా దుండగుడు కాల్పులకు తెగబడ్డాడు. దీంతో ఇద్దరు మృతి చెందారు. మరో 8 మంది గాయపడ్డారు. నల్లటి దుస్తులు ధరించిన ఓ దుండగుడు వర్సిటీలో కాల్పులు జరిపినట్లు అధికారులు తెలిపారు. ఏడంతస్తుల బారస్ అండ్ హోలీ భవనంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఇందులో స్కూల్ ఆఫ్ ఇంజినీరింగ్, ఫిజిక్స్ విభాగం ఉన్నాయి. కాల్పులు జరిగిన సమయంలో ఇంజినీరింగ్ డిజైన్ పరీక్ష జరుగుతున్నదని వెల్లడించారు.

నిందితుడి కోసం వెతుకుతున్నట్లు మేయర్ బ్రెట్ స్మైలీ తెలిపారు. కాల్పుల్లో ఇద్దరు మరణించారని, గాయపడిన ఎనిమిది మంది పరిస్థితి నిలకగా ఉందన్నారు. క్యాంపస్ సమీపంలో నివసించే ప్రజలు ఇంటి లోపలే ఉండాలని, బయటకు రాకూడదని కోరారు. ఈ ఘటన విద్యార్థుల్లో తీవ్ర భయాందోళనను సృష్టించదని చెప్పారు. ప్రస్తుతం మనం బాధితుల కోసం ప్రార్థించడం తప్ప మరేమీ చేయలేమని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు.















