మహానటుడు అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి సందర్భంగా హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో అక్కినేని నాగేశ్వరరావు పంచలోహ విగ్రహ ఆవిష్కరణ మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు చేతులమీదుగా జరిగింది.ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ తుదిశ్వాస విడిచే వరకూ నటించిన ఏకైక నటుడు ఈ భూమిపై అక్కినేని నాగేశ్వరరావు మాత్రమే. తెలుగు ప్రజల హృదయాల్లో ఆయన జీవించే ఉంటారు. ఆయన జీవితం ఓ పాంఠ్యాశం. ఆయన నడవడిక ఆచరణీయం. పరిపూర్ణమైన మనిషి అక్కినేని అని కొనియాడారు. అక్కినేని మనిషిగా మహనీయుడు.. నటుడిగా మహానటుడు. నన్ను పుత్రవాత్సల్యంతో చూసేవారు. ఆయన మాట్లాడుతుంటే తెలుగుభాష పులకించేది. చక్కని తెలుగు మాట్లాడతారాయన. క్రమశిక్షణకు మారుపేరు అక్కినేని. పిల్లల్ని కూడా అలాగే పెంచారు. పోటీ ప్రపంచంలో ధీటుగా ముందుకెళ్లి శిఖరసమానుడిగా నిలిచారు అక్కినేని. ఏఎన్నార్ ఓ నటవిద్యాలయం. ఆయన కట్టు, ఆయన మాట, ఆయన వ్యక్తిత్వం ఆయన వతృక్తం భావి తరాలకు ఆదర్శం. ఆ దారిలోనే పయనిస్తూ ముందుకెళ్తున్న ఆయన కుటుంబసభ్యులందరికీ నా అభినందనలు అన్నారు.

అక్కినేని నాగార్జున మాట్లాడుతూ చనిపోయిన గొప్పవారికి విగ్రహాలు పెట్టడం మామూలే. కానీ నాన్నగారిని విగ్రహంగా చూడటం నాకిష్టంలేదు. ఎందుకంటే నా దృష్టిలో ఆయన బతికేవున్నారు. అందుకే ఈ విగ్రహాన్ని నిర్మాణం ఉన్నప్పుడుకానీ, ప్రతిష్టించిన తర్వాతగానీ చూడలేదు. కానీ ఇప్పుడు తప్పలేదు. నాన్న నాతో లేరని ఈ విగ్రహం గుర్తు చేస్తూవుంటుంది. కనుక నమ్మాలి తప్పదు. నాన్నకు అన్నపూర్ణ స్టూడియో అంటే ప్రాణం. ఆయనకు ఇష్టమైన స్థానంలో విగ్రహాన్ని ఏర్పాటు చేశాం. ఈ విగ్రహ స్థాపనతో నాన్నకు మళ్లీ ప్రాణప్రతిష్ట జరిగిందని భావిస్తున్నాను. నాన్న ఇక ఇక్కడే ఉంటారు. నాన్నకు అభిమానులే దేవుళ్లు. ఈ రోజు ఇక్కడకొచ్చి ఈ వేడుకను విజయవంతం చేసిన అందరికీ పేరుపేరున కృతజ్ఞతలు అని అన్నారు.
ఈ కార్యక్రమంలో అక్కినేని కుటుంబ సభ్యులు, దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి, మోహన్‌బాబు, మహేశ్ దంపతులు, మురళీమోహన్, రాజేంద్రప్రసాద్, జగపతిబాబు, శ్రీకాంత్, జయసుధ, ఎం.ఎం.కీరవాణి, నాని, మంచు విష్ణు, అల్లు అరవింద్, సి.అశ్వనీదత్, టి.సుబ్బిరామిరెడ్డి, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్, దిల్‌రాజు, సి.కల్యాణ్, ఎస్.గోపాల్‌రెడ్డి, నాగవంశీ, జెమిని కిరణ్, గుణ్ణం గంగరాజు, అనుపమ్‌ఖేర్, బ్రహ్మానందం, నాజర్ తదితరులు పాల్గొని అక్కినేనికి నివాళులర్పించారు.