ఎలాన్ మస్క్ దూకుడు ఇప్పుడు అమెరికాలోనే కాకుండా ఇతర దేశాల్లోనూ సమస్యలు సృష్టిస్తున్నది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయానికి దోహదపడ్డ మస్క్ ట్రంప్ శిబిరంలో కీలక వ్యక్తిగా ఎదిగారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన నాటి నుంచి మస్క్ తీరు, ఆయన చేస్తున్న వ్యాఖ్యలు రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులను రెండుగా చీలుస్తున్నాయి. ట్రంప్ గెలుపుతో అమెరికాలో తన ప్రాబల్యాన్ని పెంచుకున్న మస్క్, ఇప్పుడు ఇతర దేశాల రాజకీయాల్లోనూ జోక్యం చేసుకుంటున్నారు. యూకే, జర్మనీ తదితర ఐరోపా దేశాల అంతర్గత అంశాల్లో వేలు పెడుతున్నారు. ఆయా దేశాల్లోని రైట్ వింగ్ పార్టీలకు బాహాటంగా మద్దతు ప్రకటిస్తూ ఇతర పార్టీలపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎక్స్ ద్వారా సోషల్ మీడియాలో, టెస్లా వంటి సంస్థలతో ఆర్థిక వ్యవస్థలో బలమైన వ్యక్తిగా మారిన మస్క్ వ్యవహారం ఇప్పుడు ఆయా దేశాల్లో కలహాలకు కారణమవుతున్నది. అమెరికాతో ఆ దేశాల సంబంధాలనూ దెబ్బతీస్తున్నది.