Namaste NRI

అంగరంగ వైభవంగా తానా కళారాధన

ఉత్తర అమెరికా తెలుగు సంఘం ( తానా)  నిర్వహించిన ‘కళారాధన’ కార్యక్రమం హైదరాబాద్  శిల్పకళా వేదిక, హైటెక్ సిటీ, లో  అట్టహాసంగా జరిగింది. తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు నట దిగ్గజాలకు “సినీ లెజెండ్స్ అవార్డులు” ఇచ్చి గౌరవించే సదుద్దేశంతో నిర్వహింపబడిన ఈ ఈవెంట్ కోసం తరలివచ్చిన ప్రముఖుల తో, కళాకారులతో కళావేదిక ప్రాంగణం కిక్కిరిసి పోయింది. 23వ తానా మహాసభల కన్వీనర్  రవి పొట్లూరి, చైతన్య స్రవంతి కన్వీనర్  సునీల్ పాంత్ర  ఈ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా, విజయవంతంగా నిర్వహించారు.

స్కంధాన్షి గ్రూప్ చైర్మన్ సురేష్ రెడ్డి గ్రాండ్ స్పాన్సర్ గా వ్యవహరించిన  ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన భారత పూర్వ ఉపరాష్ట్రపతి శ్రీ ముప్పవరపు వెంకయ్య నాయుడు గారు మాట్లాడుతూ “తానా సభ్యులు అమెరికాలో ఉంటూ కూడా మాతృదేశంపై మమకారంతో ఎంతో వ్యయ ప్రయాసలతో తెలుగు రాష్ట్రాలలో అనేకగా  సేవా కార్యక్రమాలు నిర్వహించటం ప్రశంసనీయం. తెలుగు భాషా, సాహిత్యం సంస్కృతులను పరిరక్షించే విషయంలో తానా చేస్తున్న కృషి అభినందనీయం. సినీ రంగానికి చెందిన సీనియర్ నటులకు అవార్డులు అందించటం ఎంతో ఆనందంగా ఉంది.” అంటూ తానా సేవలను కొనియాడారు.

తానా అధ్యక్షులు అంజయ్య చౌదరి లావు మాట్లాడుతూ “తానా చైతన్య స్రవంతి లో భాగంగా నెల రోజులపాటు పది కోట్ల రూపాయల ఖర్చుతో రెండు రాష్ట్రాలలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాము. దీనిలో భాగంగానే సీనియర్ సినీ నటులకు ఈ అవార్డుల ప్రదానం చేయడం మా అదృష్టం “అన్నారు.

సీనియర్ నటీనటులు కృష్ణవేణి గారు,జామున గారు, కోట శ్రీనివాసరావు గారు, మురళీమోహన్ గారు, గిరిబాబు గారు, గాయని సుశీల గారు, దర్శకులు కోదండరామ్ రెడ్డి గారు, రచయిత పరుచూరి గోపాలకృష్ణ గారు అవార్డులు అందుకున్నారు.

పద్మభూషణ్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ గారు, పద్మశ్రీ బ్రహ్మానందం గారు మాట్లాడుతూ తానా సేవలను అభినందించారు. పద్మశ్రీ శోభారాజ్ గారు తన శిష్య బృందంతో నిర్వహించిన అన్నమయ్య భక్తి గీతాల లహరి అందరినీ ఆకట్టుకుంది. సంగీత ఆచార్యులు రామాచారి గారు తన శిష్య బృందంతో నిర్వహించిన పాటల కార్యక్రమం ఆధ్యంతం రక్తి  కట్టించింది.

కొన్ని వందల మంది కళాకారులచే నిర్వహింపబడిన శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేశాయి. గాయని సునీత, గుమ్మడి గోపాలకృష్ణ గారు ఆశాంతం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. చెన్నూరి సుబ్బారావు గారు సహకారం అందించారు.

అమెరికా నుంచి   విచ్చేసిన 25 మందితో కూడిన తానా ప్రత్యేక బృందం ఈ కార్యక్రమానికి నిండుతనాన్ని చేకూర్చింది. తానా కళారాధన అటు తానా సభ్యుల లోనూ, ఇటు రెండు తెలుగు రాష్ట్రాల లోని కళాకారుల లోనూ నూతన ఉత్సాహం, ఉత్తేజం కలిగించింది. ఈ కార్యక్రమానికి ముప్పా రాజశేఖర్,  సెల్ బే, హోటల్ ఎస్వీఎమ్, తెనాలి డబల్ హార్స్ మినపగుళ్ళు వారు సహకారమందించారు.

Social Share Spread Message

Latest News

Our Advertisers

తాజా వార్తా చిత్రాలు

NRI Events