భాగవతంలో ప్రసిద్ధిపొందిన ప్రహ్లాదుడు, హిరణ్యకశిపుడు వృత్తాంతం ఆధారంగా రూపొందిస్తున్న యానిమేటెడ్ ఫీచర్ ఫిల్మ్ మహావతార్ నరసింహ. అశ్విన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్నది. మహావతార్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా రూపొందిస్తున్న తొలి సినిమా ఇది. శ్రీమహావిష్ణువు దశావతారాలను ఆవిష్కరిస్తూ ఈ ఫ్రాంఛైజీలో వరుసగా సినిమాలు నిర్మాణం కానున్నాయి. ఈ నేపథ్యంలో మహావతార్ నరసింహ ట్రైలర్‌ను విడుదల చేశారు. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుడి వరం కోసం చేసే తపస్సుతో మొదలైన ట్రైలర్ ఆద్యంతం ఉత్కంఠను పంచింది.

అపర విష్ణు భక్తుడైన ప్రహ్లాదుడు తన తండ్రి హిరణ్యకశిపుడిని ప్రతిఘటించడం, ప్రహ్లాదుడిని రక్షించడానికి నరసింహావతారంలో విష్ణువు అరుదెంచే సన్నివేశాలతో ట్రైలర్ ఆసాంతం విజువల్ వండర్‌లా సాగింది. ఈ ఇతిహాస గాధలోని ప్రతి ఫ్రేమ్‌ను గొప్పగా ఆవిష్కరించామని, మన భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని కాపాడుకోవాలనే ప్రయత్నమిదని, నరసింహ గర్జన వస్తున్నదని నిర్మాత శిల్పా ధావన్ పేర్కొన్నారు. ఈ సినిమా 3డీ వెర్షన్‌లో ఐదు భారతీయ భాషల్లో ఈ నెల 25న విడుదలకానుంది.
