అమెరికాలోని విస్కన్‌సిన్ రాష్ట్రంలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. క్రిస్మస్ పండగను పురస్కరించుకుని మిల్‌వాకీ శివారులోని వాకీషా టౌన్‌లో సంప్రదాయ వార్షిక పరేడ్‌ను నిర్వహించారు. వందలాది మంది ఉల్లాసంగా పాటలు పాడుతూ ర్యాలీగా వెళ్లారు. ఆ సమయంలో ఒక్కసారిగా ఓ ఎస్‌యూవీ బారికేడ్లను డీకొట్టి మనుషులపై నుంచి దూసుకెళ్లింది. అక్కడే ఉన్న పోలీసు అధికారి కారుపై కాల్పులు జరిపి అడ్డుకునేందుకు ప్రయత్నించినప్పటికీ డ్రైవర్ ఆగకుండా వేగంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు.ఈ ఊహించని పరిణామంతో ప్రజలంతా భయభ్రాంతులకు గురయ్యారు. అక్కడి నుంచి పరుగులు తీశారు. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. మరో 40 మందికి పైగా తీవ్రంగా గాయపడగా వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. క్షతగాత్రుల్లో 12 మంది చిన్నారులు ఉన్నారు. ఈ ఘటనకు కారణమైన ఎస్‌యూవీ డ్రైవర్‌ను పోలీసులు అరెస్టు చేసినట్లు సమాచారం. అయితే ఘటనకు గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.
![](https://namastenri.net/wp-content/uploads/2025/02/40ae94df-5916-473f-9c15-eadaf1b15c93-179x300.jpg)