ప్రపంచవ్యాప్తంగా హాలోవీన్ వేడుకలు ఏటా అక్టోబర్ 31న నిర్వహించుకుంటారు. ముఖ్యంగా వేడుకల్లో ప్రజల వేషధారణ ఎంతో విభిన్నంగా ఉంటుంది. చిన్నారులు, యువత విచిత్రమైన దుస్తులు ధరించి అందరినీ భయపెట్టే ప్రయత్నం చేస్తుంటారు. దెయ్యాలు, రాక్షసుల మాదిరి రకరకాల ఆకృతుల్లో అలంకరించుకొని, ఇరుగుపొరుగు అంతా కలిసి రాత్రి సమయంలో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఈ ఏడాది కూడా హాలోవీన్ వేడుకలను ప్రజలు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు.
మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఫ్యామిలీ కూడా ఈ హాలోవీన్ వేడుకలను జరుపుకుంది. ఈ సందర్భంగా జుకర్‌బర్గ్ దంపతులు, ముగ్గురు పిల్లలు విచిత్ర వేషధారణతో భయపెట్టే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా మార్క్ జుకర్ బర్గ్ హాలీవుడ్ చిత్రం జాన్ విక్ లోని హంతకుడి పాత్రను గెటప్‌గా వేసుకోగా, ఆయన భార్య, పిల్లలు మాత్రం మహిళా బాలెట్ డ్యాన్సర్ (బాలెరినా) దుస్తుల్లో మెరిశారు.
కాగా, ఒకప్పుడు ఈ హాలోవీన్ సంస్కృతి విదేశాలకు మాత్రమే పరిమితం అయి ఉండేంది. ఇప్పుడు మన దగ్గర కూడా బాగా విస్తరించింది. దేశంలోని పాఠశాలల్లో కూడా ఈ వేడుకలను ఎంతో ఉత్సాహంగా నిర్వహిస్తున్నారు. ఈ రోజు ప్రజలు భయానక దుస్తుల్లో కనిపిస్తారు. ఆత్మల లోకం, మన ప్రపంచం మధ్య ఉన్న గోడ బలహీనంగా మారినప్పుడు దురదృష్టకరమైన లేదా దుష్టశక్తులు భూమిలోకి ప్రవేశిస్తాయని, మానవులకు హాని కలిగించడానికి ప్రయత్నిస్తాయని చెబుతారు.