
ప్రవాస భారతీయులకు అగ్రదేశం అమెరికా ఊరట కల్పించింది. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ యాక్ట్ సవరించిన ముసాయిదా ప్రకారం ప్రతిపాదిత పన్నును 3.5 శాతం నుంచి కేవలం 1 శాతానికి తగ్గించింది. ఇది గతంలో ఆమోదించిన బిల్లుతో పోలిస్తే గణనీయమైన ఉపశమనాన్ని అందిస్తుంది. ఈ ప్రతిపాదిత పన్ను బిల్లు ప్రకారం అమెరికాలో నివసిస్తున్న విదేశీ కార్మికులు, ఉద్యోగులు, వ్యాపారులు తమ తమ దేశాలకు పంపించే డబ్బుపై తప్పనిసరిగా పన్ను చెల్లించాలి. సవరించిన ముసాయిదా ప్రకారం ఇతర ఆర్థిక సంస్థలలో ఉన్న ఖాతాల నుంచి బదిలీలను మినహాయించింది. యునైటెడ్ స్టేట్స్‌లో జారీ చేసిన డెబిట్, క్రెడిట్ కార్దుల ద్వారా జారీ చేసిన బదిలీలను కూడా మినహాయించింది. దీంతో రోజువారీ చెల్లింపులలో ఎక్కువ భాగం కొత్త పన్ను పరిధిలోకి రాకపోవచ్చునని ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. ఇది ఎన్‌ఆర్‌ఐలకు ఊరట కలిగించే అంశమే. సెనేట్ చేసిన ఈ ప్రతిపాదన ప్రకారం ఈ ఏడాది డిసెంబర్ 31 తర్వాత (2026 జనవరి 1 నుంచి) చేసే నగదు బదిలీలకు పన్ను చెల్లింపు విధానం వర్తిస్తుంది.
