హాలీవుడ్ నిర్మాత హార్వే వెయిన్‌స్టిన్ కు 18 ఏళ్ల జైలుశిక్ష పడింది. బెవర్లి హోటల్ రూమ్‌లో ఓ మహిళను రేప్ చేసిన కేసులో ఈ శిక్ష ఖరారైంది. లాస్ ఏంజిల్స్ కోర్టు ఈ శిక్షను వేసింది. 2013లో లాస్ ఏంజిల్స్‌లో ఫిల్మ్ ఫెస్టివల్ జరిగిన సమయంలో ఓ హోటల్ గదిలో ఓ నటిపై లైంగిక దాడి చేసినట్లు వెయిన్‌స్టిన్‌పై ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసులో ఆయనకు శిక్షను విధించారు. కోర్టు శిక్ష వేసిన సమయంలో వెయిన్‌స్టిన్ క్షమాభిక్ష కోరుకున్నారు. ప్లీజ్ నాకు జీవితకాల శిక్షను వేయకండి అని ఆయన జడ్జి ముందు వేడుకున్నారు. ఆ శిక్షకు నేను అర్హుడిని కాదన్నారు. ఇప్పటి వరకు హార్వేపై 80 మంది మహిళలు రేప్, అసభ్యకర ప్రవర్తన కింద ఆరోపణలు చేశారు. న్యూయార్క్‌లో నమోదు అయిన ఓ కేసులో ఇప్పటికే వెయిన్‌స్టిన్‌కు 23 ఏళ్ల జైలుశిక్ష పడిన విషయం తెలిసిందే.