ప్రధాని మోదీ బయోపిక్‌లో తాను నటించబోతున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని ప్రముఖ నటుడు సత్య రాజ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో ఇప్పటివరకు తననెవరూ సంప్రదించలేదని ఆయన తెలిపారు. ఒకవేళ మోదీ బయోపిక్‌లో నటించే అవకాశం వచ్చినా తిరస్కరిస్తానని, తన సిద్ధాంతాలకు పూర్తి విరుద్ధమైన సినిమాలో నటించలేనని సత్యరాజ్ వ్యాఖ్యానించారు.
తమిళంలో మోదీ బయోపిక్‌ను తెరకెక్కించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని, అందులో సత్యరాజ్ నటించనున్నారని గత కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతున్నది. ఈ నేపథ్యంలో సత్యరాజ్ ఈ విషయంపై స్పందించారు. ఈ వార్తలు నాకే ఆశ్చర్యం కలిగించాయి. ఇలాంటి అబద్ధపు ప్రచారాలను మానుకోవాలి. భవిష్యత్తులో మోదీ బయోపిక్ కోసం నన్ను ఎవరైనా సంప్రదిస్తే చేయనని చెబుతాను. ఎందుకంటే ఈ సినిమా నా భావజాలానికి, సిద్ధాంతాలకు పూర్తి వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది అని సత్యరాజ్ పేర్కొన్నారు.