ప్రపంచ దేశాలన్నీ పరస్పరం సహకరించుకోకపోఏ వినాశనం తప్పదని ఐక్యరాజ్యసమితి సెక్రెటరీ జనరల్ ఆంటోనియో గుటేరస్ హెచ్చరించారు. ఈజిప్ట్‌లోని షెర్మ్ ఎల్ షేక్‌లో కాప్`27 సదస్సులో వివిధ దేశాల నేతలు, ప్రతినిధులను ఉద్దేశించి గుటేరస్ ప్రసంగించారు. నరక కూపం దిశగా పయనం సాగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. వాతావరణ మార్పులను నియంత్రించకపోతే ఊహించని ఉత్పాతాలు తప్పవని పేర్కొన్నారు. కాలుష్య ఉద్గారాల విషయంలో అతిపెద్ద దేశాలైన చైనా, అమెరికా ఇకనైనా కళ్లు తెరవాలని, రాబోయే దుష్పరిణామాలను నివారించడానికి కలిసికట్టుగా పనిచేయాలని అన్నారు. భూతాపం ఆందోళనకర స్థాయిలో పెరుగుతోందని తెలిపారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో వాతావరణంలో అనూహ్య మార్పులు కనిపిస్తున్నాయని, కరువులు, వరదలు మానవాళికి పెనుసవాళ్లు విసురుతున్నాయని గుర్తు చేశారు. కర్బన ఉద్గారాలను తగ్గించుకొనేలా ధనిక, పేద దేశాలు ఒక కొత్త ఒప్పందం కుదుర్చుకోవాలని తెలిపారు. ధనిక దేశాలు 2030 నాటికి, ఇతర దేశాలకు 2040 నాటికి బొగ్గు వాడకాన్ని పూర్తిగా నిలిపివేయాలని కోరారు.