దేశవ్యాప్తంగా ఒమిక్రాన్‌తో పాటు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు ప్రస్తుతం అమలు చేస్తోన్న మార్గదర్శకాలను సవరించింది. ఒమిక్రాన్ వేరియంట్ ముప్పు ఎక్కువ ఉన్న దేశాలతో పాటు ఇతర దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు భారత్‌కు వచ్చిన తరువాత తప్పనిసరిగా 7 రోజుల పాటు క్వారంటైన్ ఉండాల్సిందే అంటూ ఆదేశాలు జారీ చేసింది. క్వారంటైన్ ముగిసిన తరువాత రోజు కరోనా నిర్ధారణ పరీక్ష తప్పనిసరిగా చేయించుకోవాలని సూచించింది. ప్రయాణానికి ముందు ప్రయాణికులు తప్పనిసరిగా 72 గంటల్లోపు చేయించుకున్న ఆర్‌టీ పీసీఆర్ పరీక్షల నెగిటివ్ రిపోర్టు సమర్పించాల్సి ఉంటుందని సూచించింది. ఈ కొత్త మార్గదర్శకాలు 11వ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.














