అయోధ్యలో ఈ నెల 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ క్రతువుల్లో భాగంగా కీలక ఘట్టం చోటుచేసుకుంది. అయోధ్య రామాలయ గర్భగుడిలోకి రామ్ లల్లా విగ్రహాన్ని చేర్చారు. తెల్లవారుజామునే జై శ్రీరామ్ నినాదాలు, పండితుల వేద మంత్రోచ్ఛారణల మధ్య క్రేన్ సహాయంతో విగ్రహాన్ని గర్భగుడిలోకి తీసుకొచ్చారు. అనంతరం బాల రామునికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గర్భగుడిలో రామ్ లల్లాను ప్రతిష్ఠించేందుకు ముందు విగ్రహాన్ని నీటితో శుభ్రం చేసే జలదివస్‌తో పాటు గణేశ పూజ, వరుణ పూజ నిర్వహించారు. కర్ణాటకకు చెందిన అరుణ్ యోగిరాజ్ అనే శిల్పి చేతుల మీదుగా రూపుదిద్దుకున్న 51 అంగుళాల ఈ విగ్రహం రాత్రి అయోధ్యకు చేరగా, క్రేన్ సహయంతో దానికి ఆలయ ప్రాంగణానికి చేర్చారు. అక్కడి నుంచి ఉదయం గర్భగుడిలోకి చేర్చారు. 22న జరిగే ప్రాణ ప్రతిష్ఠ ఉత్సవాలు మంగళవారమే ప్రారంభం కాగా, ఆ రోజు నదీ ఒడ్డున దీపోత్సవం, హారతి, బుధవారం కలశ పూజ వంటి క్రతువులు నిర్వహించారు.
