చైనాతో పోటీ పడాలంటే అమెరికా ఆర్థిక వ్యవస్థ క్షీణతను ఆపాలని, ఇందుకు సామాజిక వ్యయాన్ని పెంచడం అత్యంతావశ్యకమని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ వాదిస్తున్నారు. అయితే దీనికి ఆయన సొంత పార్టీ నుంచే వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. డెమొక్రాట్లను ఒప్పించి, ఒక ఒప్పందానికి రావడం కోసం బైడెన్ నానా తంటాలు పడుతున్నారు. దీనిలో భాగంగా ఆయన మిచిగన్‌లో పర్యటిస్తున్నారు. ప్రజలకు తన ప్రతిపాదనల గురించి మరింత వివరంగా చెప్పాలని ఆయన ప్రయత్నిస్తున్నారు.
వాషింగ్టన్లో సామాజిక వ్యయ బిల్లులపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. భద్రతా వ్యవస్థను విస్తరించడం, ఆరోగ్య పర్యావరణ కార్యక్రమాలను పెంపొందిచడం వంటివి బైడెన్ ఎజెండాలో వున్నాయి. బృహత్తరమైన సామాజిక వ్యయం ప్రతిపాదన అంతర్జాతీయంగా అమెరికా పోటీతత్వానికి చాలా కీలకమని బైడెన్ వ్యాఖ్యానించారు. తన ప్రణాళికలను వ్యతిరేకించే వారిని అమెరికా క్షీణతో భాగస్వామి గా ఆయన అభివర్ణించారు. ఇప్పటికీ ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అమెరికాదే. మనకు ఇప్పటికే బాగా పనిచేసే కార్మికులు వున్నారు. ప్రపంచంలోనే అత్యంత వినూత్నంగా ఆలోచించే మేధో శక్తి ఉంది. కానీ, ఒక దేశంగా మనం ఆ ప్రాధాన్యతను కోల్పోయే ప్రమాదంలో వున్నాం అని బైడెన్ పేర్కొన్నారు.