పొట్టు, ప్లాస్టిక్ వ్యర్థాలతో పెల్లెట్లు తయారుచేసే అంతర్జాతీయ సంస్థ ఇన్‌క్రెడిబుల్ హస్క్ ఇంటర్నేషనల్ గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలో దాదాపు రూ.205 కోట్ల పెట్టుబడితో తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. ఇందులో ఏటా వెయ్యి టన్నుల బయో పెల్లెట్లు తయారు చేయనున్నారు. ఇన్‌క్రెడిబుల్ హస్క్ గ్రూప్ యూకే సీఈవో కీత్ రిడ్జ్‌వే, ఆ సంస్థ భారత విభాగం సీఈవో సీకా చంద్రశేఖర్ నేతృత్వంలోని ప్రతినిధిబృందం లండన్‌లో రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారక రామారావుతో సమావేశమైంది.ఈ సందర్భంగా వారు తెలంగాణలో పెల్లెట్ల తయారీ యూనిట్‌ను ఏర్పాటుచేసేందుకు సంసిద్ధత వ్యక్తంచేశారు. సహకార విధానం ద్వారా పొట్టు, పునర్వినియోగ ప్లాస్టిక్ సేకరణ కోసం తగిన రోడ్‌మ్యాప్ రూపొందించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నట్టు తెలిపారు. పెల్లెట్ల తయారీ కేంద్రం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని మంత్రి కేటీఆర్ వారికి హామీ ఇచ్చారు.
సరుకు రవాణా ఓడలు, విమానాలు, గోదాముల్లో సరుకు నిల్వ చేసేందుకు ఈ పెల్లెట్లు ప్లాట్‌ఫామ్‌గా ఉపయోగపడతాయి. వీటిపై కంటెయినర్లు, సరుకు బాక్సులను ఉంచుతారు. దీనివల్ల సరుకును తేలిగ్గా ఎత్తడం, దింపడానికి వీలు కలుగుతుంది. సరుకు తడిసిపోకుండా పెల్లెట్లు కాపాడుతాయి. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, పెట్టుబడుల విభాగం ప్రత్యేక కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డి, ముఖ్య సంబంధాల అధికారి అమర్‌నాథ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.