ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి లో దాయాది పాకిస్థాన్ ను భారత్ మరోసారి ఎండగట్టింది. శాంతి గురించి బహిరంగంగా చర్చ సందర్భంగా జమ్ము కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించిన పాక్‌కు భారత్ గట్టిగా బదులిచ్చింది. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్ ను జైలుకి పంపి, అతడికి విరోధి అయిన ఆసిమ్ మునీర్ కు సర్వాధికారాలు ఇచ్చిన ఘనత ఆ దేశానికే దక్కుతుందంటూ చురకలంటించింది.లీడర్‌షిప్ ఫర్ పీస్ అనే అంశంపై ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో బహిరంగ చర్చ జరిగింది.

ఈ చర్చ సందర్భంగా పాక్ ప్రతినిధి ఆసిమ్ ఇఫ్తికార్ అహ్మద్ మాట్లాడుతూ జమ్ము కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. అంతేకాదు సింధూ జలాల ఒప్పందాన్ని భారత్ ఏకపక్షంగా నిలిపివేసిందంటూ ఆరోపణలు చేశారు. పాక్ వ్యాఖ్యలపై భారత్ ధీటుగా బదులిచ్చింది. ఈ మేరకు ఐరాసలో భారత శాశ్వత ప్రతినిధి హరీష్ పర్వతనేని మాట్లాడుతూ జమ్ముకశ్మీర్, లఢఖ్‌లు భారత్‌లో అంతర్భాగమని, వాటిని విడదీయలేమని పునరుద్ఘాటించారు. భారత్‌కు, దేశంలోని ప్రజలకు హానికలిగించడంపైనే పాక్ దృష్టి ఉంటుందని విమర్శించారు.















