ఎన్నారైలు స్వదేశాన్ని ఆర్థికంగా పరిపుష్టం చేస్తున్నారు. 2023లో ఎన్నారైలు భారత్‌కు 125 బిలియన్ డాలర్లను పంపించారు. దీంతో, అత్యధికంగా విదేశీ నిధులు అందిన దేశాల్లో భారత్ ఈ ఏడాది నెం.1గా నిలిచింది. ప్రపంచబ్యాంకు చెందిన తాజా మైగ్రేషన్ అండ్ డెవలప్మెంట్ బ్రీఫ్‌లో ఈ విషయం వెల్లడైంది. ఈ ఏడాది కూడా అభివృద్ధి చెందిన దేశాల నుంచి మధ్య, అల్పాదాయ దేశాలకు నిధుల వెల్లువ కొనసాగిందని ప్రపంచబ్యాంకు పేర్కొంది. మొత్తం 665 బిలియన్ డాలర్ల నిధులు ఆయా దేశాలకు చేరాయని పేర్కొంది.
గతేడాదితో పోలిస్తే ఈమారు3.8 శాతం అధికంగా నిధులు బదిలీ అయ్యాయని తెలిపింది. గల్ఫ్ దేశాలతో పాటూ ఇతర అభివృద్ధి చెందిన దేశాల్లో ఆశావాహ వాతావరణం ఉండటంతో విదేశాల్లోని పౌరులు తమ సొంత దేశాలకు నిధులు పంపించగలిగారని పేర్కొంది. ఈ ఏడాది కూడా భారత్‌కు అంచనాలకు మించి ఎన్నారై నిధుల వరద పారింది. మొత్తం 125 బిలియన్ డాలర్ల నిధులు వచ్చాయి. అమెరికా, ఐరోపా దేశాల్లో ఉపాధి అవకాశాలు పెరగడంతో రికార్డు స్థాయిలో భారత్‌కు నిధులు వచ్చాయని ప్రపంచబ్యాంకు పేర్కొంది.